
ఎస్సీ వర్గీకరణ పేర పబ్బం
మంద కృష్ణపై పిడమర్తి రవి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండేళ్లుగా టీఆర్‌ఎస్ నేతృత్వంలో ప్రభుత్వ పాలన బ్రహ్మాండంగా సాగుతున్నా మంద కృష్ణ మాదిగ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మంద కృష్ణ నిరంతరం మండిస్తూ తన పబ్బం గడుపుకొంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఇంటికి దండయాత్ర చేస్తామంటే తాము చూస్తూ ఊరుకోమన్నారు.
ఎమ్మార్పీఎస్ జెండాలు పట్టుకుని చంద్రబాబుకు తెలంగాణలో స్వాగతం పలికావ్.. మరి ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారా అని మందకృష్ణను ప్రశ్నించారు. ‘నీకు చదువు రాదు. ఉద్యోగం లేదు. ఉద్యమం చదువుకున్న వారితో, విద్యార్థులతో చేయాలి. నువ్వు ఓట్లు వేయమని చెప్పింది మోదీ, చంద్రబాబులకు. కాబట్టి ఆ ఇద్దరి ఇళ్లపైకి దండయాత్ర చేయాలి. సీఎం కేసీఆర్ ఇంటిపైకి కాదు..’ అని రవి హితవు పలికారు. పుటం పురుషోత్తం, మందుల వరలక్ష్మీ పాల్గొన్నారు.