హైదరాబాద్: శ్రీనగర్ కాలనీలోని రత్నదీప్ సూపర్‌మార్కెట్ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం పంజగుట్ట ట్రాఫిక్ ఏసీపీ మాసుంబాషా, బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ రావు అక్కడ పర్యటించారు. నాలుగువైపులా కూడలి ఉండటంతో వాహనాలు ఇష్టమొచ్చినట్లు మళ్లుతున్నాయని దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించారు. ఇందుకు పరిష్కారంగా ఇక్కడ టూ వే చేయాలని నిర్ణయించారు.
శ్రీనగర్ కాలనీ వైపు నుంచి టీవీ 9 వైపు బంజారాహిల్స్‌కు వెళ్లే వాహనదారులు నేరుగా వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాగే, టీవీ9 వైపు నుంచి పెట్రోల్ బంక్ మీదుగా రత్నదీప్ సూపర్‌మార్కెట్ వైపు వెళ్లేందుకు వీలుపడదు. ఇటు వైపు వాహనాలను అనుమతించకుండా మధ్యలో డివైడర్‌ను ఏర్పాటు చేస్తారు. రత్నదీప్ వైపు వెళ్లేవారు శ్రీనగర్‌కాలనీ పార్కు వైపు నుంచి యూ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగు వైపులా వాహనాలను అనుమతించకుండా కేవలం రాకపోకలు మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా చేస్తే ఇక్కడ ట్రాఫిక్ సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుందని అధికారులు తెలిపారు.