![అరెస్టులతో సమస్య పరిష్కారం కాదు](/styles/webp/s3/article_images/2017/09/5/81492978484_625x300_0.jpg.webp?itok=tHW1NA27)
అరెస్టులతో సమస్య పరిష్కారం కాదు
నిరుద్యోగ సమస్యపై ప్రొఫెసర్ కోదండరాం
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు పాల్గొనకుండా చేసి ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకోవడం శోచనీయమని టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం అన్నారు. నిరుద్యోగ జేఏసీ చాలాకాలంగా ప్రభుత్వం ముందు, వర్సిటీ యాజమాన్యం ముందు పెడుతున్న ఉద్యోగ నియామకాల సమస్యను పరిష్కరించే బదులు విద్యార్థులను అరెస్టులు చేయడం సమంజసం కాదని అన్నారు. పోలీసులతో విద్యార్థులను అణచివేయొచ్చేమో కానీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొనే అవకాశం మాత్రం ఉండదని స్పష్టం చేశారు.
నిజానికి సెంటినరీ ఉత్సవాల్లో పాలుపంచుకోవాలని తనకు సైతం ఉన్నప్పటికీ విద్యార్థుల అరెస్టులకు నిరసనగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవని, వలస పాలకుల నుంచి వారసత్వంగా వచ్చిన నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలని కోదండరాం సూచించారు.