శాతవాహన యూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీలో సోమవారం జరిగిన తెలుగు పరీక్షలో 50 శాతానికి పైగా మార్కులకు సంబంధించిన ప్రశ్నలు సిలబస్‌లో లేనివి వచ్చాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు జనవరి 2న ప్రారంభమయ్యాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం గ్రూపుల్లో మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థులకు సోమవారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రం 80 మార్కులకు ఉండగా దాదాపు 46 మార్కులకు సిలబస్‌లో లేని ప్రశ్నలే ఉన్నాయి. పరీక్ష కేంద్రాల్లోని సిబ్బందికి సమాచారమివ్వగా వారు వర్సిటీ అధికారులకు వివరించారు. తప్పిదాన్ని గుర్తించిన అధికారులు విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు. సిలబస్‌లో లేని ప్రశ్నలకు పూర్తి మార్కులు కలపాలని విద్యార్థులు కోరుతున్నారు.
పదే పదే తప్పులు..
వర్సిటీ ప్రారంభం నుంచి పరీక్షల నిర్వహణలో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. పరీక్షల విభాగం పటిష్టంగా లేకపోవడమే ప్రధాన కారణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నాపత్రం తయారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తప్పులు దొర్లాయని అధికారులు చెబుతున్నారు. గతంలో డిగ్రీ ఫైనలియర్ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ ఇంగ్లిష్ మీడియం ప్రశ్నపత్రం ముద్రణనే మరిచారు. సీబీసీఎస్(చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్) పద్ధతిలో జరిగిన ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ పరీక్షలో 40 మార్కులకు ప్రశ్నపత్రంలో 2 గంటలకు బదులు 3 గంటలని ముద్రించారు. బీకాం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 80 మార్కులు, ప్రాక్టికల్ 20 మార్కులుంటాయని సిలబస్‌లో నిర్ణయించారు. కానీ, ప్రశ్నాపత్రం 60మార్కులకే ఇచ్చారు. మార్కులు, మోమోల విషయంలోనూ పలుమార్లు తప్పులు దొర్లడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డ సందర్భాలు అనేకం.
న్యాయం చేస్తాం..
డిగ్రీ మొదటి సెమిస్టర్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రంలో కొన్ని సిలబస్‌లో లేని ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నపత్రం తయారీలో పొరపాటుతో ఇలా జరిగింది. వీసీ అనుమతి తీసుకొని విద్యార్థులు నష్టపోకుండా న్యాయం చేస్తాం.
– వి.రమేశ్, ఎగ్జామినేషన్ కంట్రోలర్
Comments
Please login to add a commentAdd a comment