చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై కేంద్రానికి లేఖ రాయాలి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆర్.కృష్ణయ్య వినతి
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఇతర డిమాండ్ల పరిష్కారానికి పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జాతీయ బీసీ సంక్షేమసంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వినతిపత్రాన్ని సమర్పించారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడిని పెంచడానికి వైఎస్సార్‌సీపీ పక్షాన లేఖ రాయాలని జగన్‌ను కోరినట్లు ఆర్.కృష్ణయ్య తెలి పారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయనను కలసి 12 బీసీ సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని సమర్పించినట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు.
పార్లమెంట్‌లో బీసీ బిల్లుపై కేంద్రానికి లేఖలు రాయాలని కోరేందుకు అన్ని పార్టీల అధ్యక్షులను కలుసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నా రు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, తదితర డిమాండ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండు రోజుల్లో లేఖ రాస్తానని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తమకు హామీ ఇచ్చారని తెలి పారు. బీసీల సమగ్రాభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని వైఎస్ జగన్ చెప్పారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీసీలకు చట్టసభల్లో 34 శాతం రిజర్వేషన్లు పెట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌ను, ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీని అభినందించినట్లు తెలిపారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెంచాలని, వీటికి రాజ్యాంగభద్రత కల్పించాలని, కేంద్ర విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 నుంచి 56 శాతానికి పెంచాలని వినతిపత్రంలో పొందుపరిచినట్లు కృష్ణయ్య చెప్పారు. ప్రతినిధి బృందంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమే శ్, నీల వెంకటేశ్, విక్రమ్‌గౌడ్ ఉన్నారు.