
కాపులపై కక్షకట్టి వర్గాలు సృష్టిస్తున్న బాబు
కాపులపై సీఎం చంద్రబాబు కక్షకట్టి ఆ కులస్తుల మధ్యే వర్గాలను సృష్టిస్తూ అన్నిరకాలుగా హింసిస్తున్నారని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు.
శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య
సాక్షి, హైదరాబాద్: కాపులపై సీఎం చంద్రబాబు కక్షకట్టి ఆ కులస్తుల మధ్యే వర్గాలను సృష్టిస్తూ అన్నిరకాలుగా హింసిస్తున్నారని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. పీసీసీ నేతలు సాకే శైలజానాథ్, జంగా గౌతం, సూర్యానాయక్‌లతో కలిసి ఆయన శుక్రవారం ఇందిర భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
కాపులకు ఆరు నెలల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి రెండేళ్లయినా వాటి గురించి పట్టించుకోకపోవడంతో బాబుపై నమ్మకం లేక ముద్రగడ శాంతియుతంగా ఆందోళనకు దిగితే తప్పా? అని ప్రశ్నించారు. తునిలో రైలుకు నిప్పు పెట్టడంలో కూడా ప్రభుత్వ పాత్ర ఉందనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయన్నారు. తుని సంఘటనలో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణకు ఆదేశిస్తే వాటి వెనక చంద్రబాబు పాత్ర ఉందా? లేదా? అనే విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.