చీకటి ఒప్పందాలను బహిర్గతం చేయాలి
ఏపీ రాజధాని భూములపై ఆళ్ల రామకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంతంలో విదేశీ సంస్థలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలన్నింటినీ బహిర్గతం చేయాలనీ, వెంటనే లావాదేవీలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను, ఇవ్వని రైతులను కూడా చంద్రబాబు దారుణంగా మోసం చేస్తున్నారని, ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సింగపూర్ సంస్థలైన సెమ్‌కార్ప్, సెమ్‌బ్రిడ్జి, అసెండాస్‌కు 1,700 ఎకరాల భూమిని దత్తం చేస్తూ సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుందని చెప్పారు.
చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు భూములిచ్చిన రైతులకు కచ్చితంగా ఈ 1,700 ఎకరాల్లోనే వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఒప్పందాలు చేసుకునేటపుడు ఎక్కడైనా ప్రైవేటు వాటా తక్కువగా ఉంటుందని కానీ చంద్రబాబు కొత్త పద్ధతికి తెరలేపుతూ తొలి దశ ఒప్పందంలో 58% ప్రైవేటుకు ఇచ్చి 42% ప్రభుత్వ సంస్థలు తీసుకుంటున్నాయని విమర్శించారు. పైగా ప్రైవేటుకు ఇస్తున్న 58% భూముల్లో 32% ఎవరికైనా అమ్ముకోవచ్చనడం దారుణమన్నారు.
పాలనాపరమైన టైజం: వాసిరెడ్డి పద్మ
చంద్రబాబు తన ఏకపక్ష విధానాలతో పరిపాలనలో టైజాన్ని సృష్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ... ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులందరూ టీడీపీ నేతలు చెప్పిన విధంగానే నడుచుకోవాలని బాబు ఆదేశాలివ్వడం దారుణమన్నారు.