రాముడు నా పాలి దేవుడు..
పొట్ట ఓ చేత పట్టుకుని.. మరో చేత రాముడ్ని పట్టుకుని దుర్గయ్య పట్నం వచ్చాడు. కుటుంబాన్ని సొంతూరు మెదక్‌లోనే వదిలేసి రాముడి పై భారం వేసి ఇక్కడొచ్చిపడ్డాడు. సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు రాముడు రోజూ పెందరాలే ముస్తాబవుతాడు. దుర్గయ్య వెంట ఇంటింటికీ తిరుగుతాడు. అందరికీ దండాలు పెడతాడు. తన యజమానితో కలసి విన్యాసాలు చేస్తాడు. పంచెలతో తను సన్మానం పొంది.. దుర్గయ్యకు ఇన్ని పైసలు గిట్టుబాటు అయ్యేలా చూస్తాడు. అందుకే రాముడు నా పాలి దేవుడు అంటాడు దుర్గయ్య. తాతల నాటి నుంచి వచ్చిన వృత్తిని స్వీకరించిన దుర్గయ్య.. రాముడు తన పెద్దకొడుకని చెబుతాడు.
రాముడు సంపాదనతోనే తన నలుగురు పిల్లలను చదివిస్తున్నానని చెబుతాడు. ‘రాముడు చెప్పిన మాట ఇంటడు. మా కడుపు నిండకపోయినా వీడ్ని మంచిగ జూస్కుంటం. పానం బాగోకపోయినా.. నా ఎంటొస్తడు. సంక్రాంతి అయిపోయినాంక మాకు అంత డిమాండ్ ఉండది. అయితే కొందరు వాళ్లింట్ల ఏ కార్యాలైనా పిలుస్తుంటరు. అట్ల ఏడాదంతా నడుస్తది. వారానికోపారి మెదక్ పోయి మా వోళ ్లకు పైసలిచ్చొస్తుంట. రాముడు ఉన్నంతకాలం బేఫికర్. ఆడు లేకపోతే ఎట్లనో’ అని చెమర్చిన కళ్లతో చెబుతాడు దుర్గయ్య.
..:: శిరీష చల్లపల్లి