మరో సాహసానికి సై | Ready another risk | Sakshi
Sakshi News home page

మరో సాహసానికి సై

Published Sun, Jul 31 2016 4:18 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

మరో సాహసానికి సై

మరో సాహసానికి సై

కిలిమంజారో పర్వతారోహణకు సిద్ధమవుతున్న గురుకుల విద్యార్థులు
 
సాక్షి, హైదరాబాద్ : కిలిమంజారో... పదిహేడు వేల అడుగుల ఎత్తు... తక్కువ ఉష్ణోగ్రతలు... బలమైన గాలులు... ఆఫ్రికాలోనే ఎత్తయిన పర్వతం ఇది. అన్నింటికీ మించి ఎప్పుడు బద్దలవుతుందో తెలియని అగ్నిపర్వతాల శ్రేణి. ఆకాశాన్ని ముద్డాడుతున్నట్టుండే ఈ పర్వత శిఖరాన్ని చూడటమే గగనం. అలాంటిది అధిరోహించడమంటే..! పెద్ద సాహసమే కదా! కానీ... దీన్ని సవాలుగా తీసుకున్నారు రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యార్థులు. టాంజానియాలోని కిలిమంజారో శిఖరాన్ని చేరి... మన జెండాను రెపరెపలాడించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

ఎవరెస్టును ఎక్కి చరిత్ర సృష్టించిన గురుకుల విద్యార్థులు పూర్ణ, ఆనంద్ స్ఫూర్తితో... మౌంట్ రెనోక్‌ను అధిరోహించిన 32 మంది బృందంలోని వారితో పాటు ఎస్సీ, ఎస్టీ గురుకులాలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవీ)కు చెందిన విద్యార్థినులు కూడా ఈసారి జతకలిశారు. ప్రధానంగా మెదక్ జిల్లాకు చెందిన కేజీబీవీ విద్యార్థినులకు ఇందులో భాగస్వాములను చేసేందుకు కలెక్టర్ రొనాల్డ్ రాస్ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ బృందం భువనగిరిలో ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకుంది. అయితే బృందంలో సభ్యులెంతమంది ఉంటారన్నది వచ్చే నెల మొదటి వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత ఎప్పుడు వెళ్లేదీ ప్రకటిస్తారు.

 విభిన్న పర్వత శ్రేణి...
 ఆఫ్రికాలోనే ఎత్తయిన పర్వతం కిలిమంజాలరో. దాదాపు 17 వేల అడుగుల (4,900 మీటర్ల) ఎత్తులో ఉంది. దీనిలోనే మవెంజి, షిరా, కిబో అగ్ని పర్వతాలున్నాయి. ‘తెల్లపర్వతం’గా కూడా దీన్ని పిలుస్తారు. మొత్తం 7 పర్వతారోహణ మార్గాలున్నాయి. తక్కువ ఉష్ణోగ్రత, అప్పుడప్పుడు వీచే బలమైన గాలులు దీనిని ప్రమాదకరంగా మార్చే అవకాశాలున్నాయి.
 
 వారికి సమస్య కాకపోవచ్చు...
 పర్వతారోహణ ఇష్టపడే విద్యార్థులకు ఇది సాహస యాత్రే. కేజీబీవీకి చెందిన విద్యార్థినులతో పాటు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులను తీసుకెళ్లాలని ప్రభుత్వ ప్రతిపాదన. గతంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్టు, మౌంట్ రెనోక్‌లు అధిరోహించినప్పుడు వారితో నేనూ వెళ్లా. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాను. ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నందున... పగటి పూట అమిత వేడి, రాత్రిపూట చల్లగా ఉంటుంది. రెనోక్ ఎక్కిన విద్యార్థులకు ఈ పర్వతారోహణ సమస్య కాకపోవచ్చు.  
     - శేఖర్‌బాబు, పర్వతారోహకుడు, శిక్షకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement