ప్రాణం తీసిన ‘రియాల్టీ’ మోజు | reality show motivation act leads to death | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ‘రియాల్టీ’ మోజు

Published Tue, Apr 12 2016 2:23 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దృశ్యం. (ఇన్‌సెట్లో) జలాలుద్దీన్ - Sakshi

ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దృశ్యం. (ఇన్‌సెట్లో) జలాలుద్దీన్

► మంటలంటుకున్నాక తప్పించుకోవాలని వ్యూహం
► స్నేహితులతో కలసి నిర్మానుష్య ప్రాంతంలో సాహసకృత్యం చిత్రీకరణ
► ఒంటికి ఒక్కసారిగా అంటుకున్న మంటలు
► వెంటనే టీషర్ట్ విప్పడం సాధ్యం కాకపోవడంతో కుప్పకూలిన వైనం
► 60 శాతం కాలిపోయిన శరీరం
► ఆసుపత్రిలో నాలుగురోజులుగా చికిత్స పొందుతూ మృతి
► నగరంలోని బార్కాస్ ప్రాంతంలో ఘటన

 సాక్షి, హైదరాబాద్: ఆ కుర్రాడికి టీవీల్లో వచ్చే రియాల్టీ షోలంటే పిచ్చి.. అందులో తానూ సాహసకృత్యాలు చేసి శభాష్ అన్పించుకోవాలని కోరిక.. ఎలాగైనా ఆ షోకు వెళ్లాలనుకున్నాడు.. తల్లిదండ్రులు వారిస్తున్నా వినలేదు.. వారి కంట పడకుండా దూరంగా వెళ్లి ఫ్రెండ్స్‌తో కలసి సాహసం చేయబోయాడు.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని మంటలంటుకున్నాక షర్ట్ విప్పేసి చాకచక్యంగా తప్పించుకుంటానని చెప్పాడు.. స్నేహితులు వీడియో తీయడం మొదలుపెట్టారు.. కానీ మంటలు అంటుకున్నాక షర్ట్ విప్పడం సాధ్యం కాలేదు.. చివరికి 60 శాతం కాలిన గాయాలతో నాలుగు రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు!! హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్రాంతంలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది.

కలర్స్ చానల్ షోపై మోజు: పాతబస్తీలోని బార్కాస్‌కు చెందిన బషీరుద్దీన్ కుమారుడు జలాలుద్దీన్ (19) శాలిబండలోని గౌతం జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. సీఎన్‌ఎన్-ఐబీఎన్ సంస్థకు చెందిన కలర్స్ చానల్  నిర్వహిస్తున్న ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ రియాల్టీ షోపై ఇతడు మోజు పెంచుకున్నాడు. ఈ షోకు చెందిన ఏడో సీజన్ ‘ఫియర్ ఫ్యాక్టర్- ఖత్రోంకే ఖిలాడీ’ ఇటీవలే ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న యువతలో ఉన్న ధైర్య సాహసాలను వెలికి తీసి ప్రదర్శించడమే తమ ఉద్దేశమని ఈ కార్యక్రమ నిర్వాహకులు చెబుతున్నారు.

దీనికి జడ్జిలుగా వ్యవహరిస్తున్న పలువురు ప్రముఖులు, సినీ తారలు షోలో పాల్గొనే వారి సాహసాలను చూసి పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఈ రియాల్టీ షో విజేతలకు ప్రైజ్‌మనీ కూడా రూ.లక్షల్లో ఉంటోంది. ఇవన్నీ జలాలుద్దీన్‌ను ప్రేరేపించాయి. ఈ రియాల్టీ షోలో పాల్గొనేందుకు ముందుగా ఎంట్రీ వీడియోలను పంపాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించాక అర్హులను షోకు ఆహ్వానిస్తారు. దీంతో ఎంట్రీ వీడియో చిత్రీకరించాలని జలాలుద్దీన్ భావించాడు. నిప్పుతో కూడిన సాహసకృత్యాన్ని ఎంపిక చేసుకున్నాడు. అతడి ప్రయత్నాలను గమనించిన తల్లిదండ్రులు పలుమార్లు హెచ్చరించారు. దీంతో జలాలుద్దీన్ ఇంటి బయట స్నేహితులతో కలిసి వీడియో చిత్రీకరణకు సిద్ధమయ్యాడు.

 

టీ-షర్ట్ కావడంతో అడ్డం తిరిగిన కథ..
గురువారం మధ్యాహ్నం జలాలుద్దీన్ బంధువులు, స్నేహితులతో కలిసి బార్కాస్ ప్రాంతంలోని వీడియో చిత్రీకరణ ప్రారంభించాడు. నోట్లో కిరోసిన్ పోసుకొని మండుతున్న కర్రను ఊదుతూ గాల్లో అగ్నిగోళాలు సృష్టించాడు. దీనికి సంబంధించి 41 సెకన్ల నిడివితో ఉన్న వీడియోను అతడి స్నేహితులు చిత్రీకరించారు. అయితే ఈ ప్రయత్నాలను బస్తీ వాసులు అడ్డుకుని, మందలించడంతో ఫ్రెండ్స్‌తో కలిసి ఫలక్‌నుమ వద్ద ఉన్న గుట్టపైకి వెళ్లాడు. అక్కడ మరో అడుగు ముందుకు వేసిన జలాలుద్దీన్... ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటానని, కొద్దిసేపట్లోనే చాకచక్యంగా షర్ట్ విప్పేసి బయటపడతానని చెప్పి ఆ దృశ్యాలను రికార్డు చేయమని కోరాడు.

అనుకున్నట్టే వెంట తెచ్చుకున్న బాటిల్‌లోని కిరోసిన్‌ను ఒంటిపై పోసుకున్నాడు. తర్వాత నిప్పంటిచుకొని షర్ట్ విప్పేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాలను జలాలుద్దీన్ వెంట ఉన్న వారు 28 సెకన్ల నిడివితో సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. అయితే ఆ సమయంలో అతడు ధరించింది టీ-షర్ట్ కావడం, అది టైట్‌గా ఉండటంతో అనుకున్న సమయంలో విప్పలేకపోయాడు. ఈ లోపు మంటలు ఎక్కువయ్యాయి. ఆక్సిజన్ అందక మెదడు చచ్చుబడిపోయినట్లయింది. మంటల్లో చిక్కుకొని జలాలుద్దీన్ కాసేపటికే అచేతనంగా కుప్పకూలిపోయాడు.

60 శాతం కాలిన గాయాలు
మంటల్లో జలాలుద్దీన్ శరీరం దాదాపు 60 శాతం కాలిపోయింది. ఈ హఠాత్పరిణామంతో అతడి వెంట ఉన్న స్నేహితులు కంగుతిన్నారు. వెంటనే తేరుకుని మంటల్ని ఆర్పి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గురువారం నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జలాలుద్దీన్ పరిస్థితి విషమించడంతో ఆదివారం చనిపోయాడు. ఈ విషయం సోమవారం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసుకున్న ఫలక్‌నుమ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జలాలుద్దీన్ సాహసకృత్యాలతో కూడిన రెండు వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. అతడి స్నేహితుల వాంగ్మూలాలు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement