రోడ్డు ప్రమాదంతో వెలుగులోకి..
శంషాబాద్ రూరల్: లారీలో గుట్టుగా తరలిస్తున్న ఎర్రచందనం యాక్సిడెంట్‌తో బయటపడింది. బుధవారం తెల్లవారుజామున ఔటర్ రింగు రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. తుక్కుగూడ వైపు నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ వస్తున్న ఓ లారీ (ఏపీ 21వై-2777)ని హమీదుల్లానగర్ సమీపంలో వెనక నుంచి మరో లారీ ఢీకొంది. దీంతో ముందు వెళ్తున్న లారీ బోల్తా పడింది. వాహనంలో ఉన్న పెట్టెలు కింద పడడంతో అందులో అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి.
వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఒక్కోపెట్టెలో 10 దుంగలు ఉండగా మొత్తం పది పెట్టెలు లారీలో ఉన్నాయి. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ.5 లక్షలు ఉంటుందని ఫారెస్టు అధికారులు అంచనా వేస్తున్నారు. లారీ ముందు భాగంలో ఏపీ 21వై 2777 నంబరు ఉండగా, వెనక భాగంలో ఏపీ 22వై 2777 నంబరు ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు.