రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్‌! | Reduced revenue in registrations income! | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్‌!

Published Sat, Apr 1 2017 4:00 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్‌!

రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్‌!

నోట్ల రద్దు, ఇతర కారణాలతో తగ్గిన రాబడి
- అవినీతి, అధికారుల నిర్లక్ష్యమూ కారణమే
- పెరిగిన మద్యం విక్రయాల ఆదాయం
- ఫరవాలేదనిపించిన అమ్మకపు పన్ను
- ముగిసిన 2016–17 ఆర్థిక సంవత్సరం
- కేంద్ర పన్నుల్లోంచి వచ్చే రాష్ట్రవాటాపైనే సర్కారు ఆశలు!  


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మూడో ఆర్థిక సంవత్సరం ఈ మార్చి 31తో ముగిసిపోయింది. 2016–17లో రిజిస్ట్రేషన్ల ద్వారా ఊహించినంత ఆదాయం రాకపోవడం సర్కారు అంచనాలను దెబ్బ తీసింది. నోట్ల రద్దు ప్రభావంతో డిసెంబర్‌ నుంచి వరుసగా స్టాంపులు–రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో మద్యం అమ్మకాలతో వచ్చే రాబడి పెరగడం రాష్ట్ర ఖజానాకు కొంత ఊరటనిచ్చింది.

మరోసారి లక్ష్యానికి దూరంగా..
వార్షికాదాయ లక్ష్యాన్ని చేరుకోవడంలో స్టాంపు లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈసారి కూడా చతికిల పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంటున్న దశలో కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కోలుకోలేని దెబ్బతీసింది. వాస్తవానికి 2016–17లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖకు వార్షికాదాయ లక్ష్యాన్ని (స్టాంపుడ్యూటీ మాత్రమే) రూ.4,291.99 కోట్లుగా నిర్దేశించింది. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.3,549 కోట్లు మాత్రమే సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి నవంబర్‌ వరకు ప్రతి నెలా రూ.330 కోట్ల వరకు ఆదాయం రాగా.. డిసెంబర్‌లో రూ.243 కోట్లు, జనవరిలో రూ.222 కోట్లకు తగ్గిపో యింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. మొత్తంగా లక్ష్యంలో 82.7 శాతం ఆదాయం లభించినా.. అది గతేడాది (83.7 శాతం) కన్నా తక్కువే.

అవినీతి, నిర్లక్ష్యమే కారణం!
మూడేళ్లుగా క్షేత్రస్థాయిలో తనిఖీలు సక్రమం గా చేయకపోవడంతో కిందిస్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, మార్కెట్‌ విలువ కంటే తక్కువగా లెక్కించి రిజిస్ట్రేషన్ల ఆదాయానికి గండికొట్టారని కాగ్‌ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఏడేళ్లుగా సబ్‌ రిజిస్ట్రార్ల బదిలీలు చేయకపోవడం, కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు ఐదేళ్లకు పైగా ఒకే స్థానంలో పనిచేస్తుండడం కూడా అవినీతికి ఆస్కారమి చ్చినట్టయిందనే ఆరోపణలున్నాయి. మరో వైపు ఈ శాఖకు మూడేళ్లుగా పూర్తిస్థాయి కమిషనర్‌ కూడా లేరు. ఇన్‌చార్జిగా ఉన్న అధికారికే మరో రెండు విభాగాల బాధ్యత లను కూడా అప్పగించడం కూడా ఇబ్బం దికరంగా మారిందని చెబుతున్నారు. ఇక 10 జిల్లా రిజిస్ట్రార్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

తగ్గిన పన్నేతర ఆదాయం
రాష్ట్రంలో పన్నేతర రాబడి గణనీయంగా తగి ్గపోయింది. ఫీజులు, జరిమానాలు, డివిడెండ్లు, లాభాలు, అటవీ ఉత్పత్తులు, ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం ఈ పద్దులో ఉంటుంది. 2015–16లో పన్నేతర రాబడి ద్వారా రూ.17,542 కోట్లు సమకూరుతాయని అంచనా వేయగా.. జనవరి నాటికి రూ.2,728 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.

ఆదుకున్న మద్యం విక్రయాలు
రాష్ట్ర ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా వచ్చిన ఆదాయం చివరి నాలుగు నెలల్లో భారీగా పెరిగింది. మద్యం ఉత్పత్తులపై పన్ను ద్వారా రూ.4,543 కోట్లు రాబట్టాలని అంచనా వేయగా.. జనవరి నాటికే ఆ మేర ఆదాయం సమకూరడం గమనార్హం. ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా అక్టోబర్‌లో రూ.291 కోట్లు, నవంబర్‌లో రూ.201 కోట్లురాగా.. డిసెంబర్‌లో ఏకంగా రూ.564 కోట్లు సమకూరాయి. నాలుగు నెలలకోసారి మద్యం కంపెనీలు చెల్లించే వాటా జమకావటంతో జనవరిలో రూ.812 కోట్లు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ రాబడి పెరిగింది. ఇక అమ్మకపు పన్ను (సేల్స్‌ ట్యాక్స్‌) ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది పొడవునా నిలకడగా కొనసాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement