ఎక్కం చెప్పలేదని చావబాదాడు... | Registered a case against the teacher | Sakshi
Sakshi News home page

ఎక్కం చెప్పలేదని చావబాదాడు...

Published Thu, Mar 17 2016 6:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

ఎక్కం చెప్పలేదని చావబాదాడు...

ఎక్కం చెప్పలేదని చావబాదాడు...

ఉపాధ్యాయుడిపై కేసు నమోదు

తుర్కయంజాల్: చిన్నారులను సొంతబిడ్డల్లా లాలిస్తూ.. వారికి అర్థం అయ్యేలా విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు క్రమశిక్షణ పేరుతో చావబాదుతున్నారు. క్లాసు లో అల్లరి చేశారనో, హోంవర్క్ చేయలేదనో.. తమ మాట వినలేదనో చేయి చేసుకుంటున్నారు. చదువు పేరుతో విద్యార్థులను దండిస్తే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ హెచ్చరిస్తున్నా... ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం పట్టించుకోవడంలేదు.  ఎక్కం చెప్పలేదని గణిత ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థిని ఆసుపత్రి పాలైన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో జరిగింది.

బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం...  హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామం తుల్జాభవానీనగర్ కాలనీ నివాసి వడ్త్యా శ్రీను, సునీతల కుమార్తె అరుణ శ్రీకృష్ణదేవరాయనగర్ కాలనీ లోని కార్తికేయ కాన్సెప్ట్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం గణిత ఉపాధ్యాయుడు రాజు.. అరుణను 18వ ఎక్కం చెప్పమన్నాడు. తాను 18వ ఎక్కం కంఠస్థం చెయ్యలేదని... 19వ ఎక్కం నేర్చుకొచ్చానని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు అరుణ మెడపై  కట్టెతో కొట్టాడు. దీంతో అరుణ మెడ ఒక వైపునకు వంగి సరిగ్గా రావడం లేదు. అనంతరం తల్లిదండ్రులకు చెప్పవద్దని బెదిరించి.. నొప్పి తగ్గడానికి మాత్రలు తెచ్చి ఇచ్చాడు. రెండు రోజుల నుంచి ఇలా నొప్పిని భరిస్తూనే అరుణ పాఠశాలలో జరుగుతున్న పరీక్షలకు హాజరవుతోంది కాని తల్లిదండ్రులతో చెప్పలేదు. బుధవారం మధ్యాహ్నం నొప్పి తీవ్రం కావడంతో భరించలేక  ఏడుస్తూ తండ్రి శ్రీనుకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే శ్రీను ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి విభాగం నాయకుడు గ్యార క్రాంతికుమార్‌ని తీసుకుని పాఠశాలకు వెళ్లి.. తమ పాపను ఎందుకు కొట్టారని నిల దీశాడు.

దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం అరుణను హస్తినాపురంలోని డెల్టా ఆసుపత్రిలో చేర్పిం చింది.  డాక్టర్లు బాలికకు పలు పరీక్షలు చేసి చికిత్సలందిస్తున్నారు. అనంతరం డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. కట్టెతో కొట్టడం వల్ల అరుణ మెడ నరం పట్టుకుందని, ఆమెకు ఎలాంటి అపాయం లేదన్నారు. కాగా బాలికను కొట్టిన ఉపాధ్యాయుడు రాజు పాఠశాలకు సెలవుపెట్టి, ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు.

పూర్తి వైద్యం చేయించాలి: ఏఐఎస్‌ఎఫ్
విద్యార్థిని అరుణకు పూర్తి వైద్య ఖర్చులను పాఠశాల యాజమాన్యం భరించాలి. అదే విధంగా విద్యార్థినిని కొట్టి, వెకిలి చేష్టలతో దూషించిన ఉపాధ్యాయుడు రాజుపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు గ్యార క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసులు పెట్టాలి
సిటీబ్యూరో: ఎక్కం చెప్పలేదని విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయుడు రాజును అరెస్టు చేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు బుధవారం డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎందుకిలా ఉన్నావ్ ...
‘నువ్వు ఎందుకిలా బండలా ఉన్నావ్..... 5వ తరగతిలోనే నా అంత ఎత్తు పెరిగావు’... అంటూ గణితం టీచర్ రాజు అసభ్యంగా వెకిలి చేష్టలతో దూషించే వాడని బాధిత విద్యార్థిని అరుణ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement