జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై పెట్టిన కేసులను ఎత్తివేసి, బేషరతుగా ఆయనను విడుదల చేయాలని ఏఐవైఎఫ్, పీవైఎల్, డీవైఎఫ్‌ఐ, యూత్‌కాంగ్రెస్ డిమాండ్ చేశాయి.
విద్యార్థి సంఘాల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై పెట్టిన కేసులను ఎత్తివేసి, బేషరతుగా ఆయనను విడుదల చేయాలని ఏఐవైఎఫ్, పీవైఎల్, డీవైఎఫ్‌ఐ, యూత్‌కాంగ్రెస్ డిమాండ్ చేశాయి. జర్నలిస్టులు, విద్యార్థులు, లాయర్లపై దాడి చేసిన వారిని శిక్షించాలంటూ వివిధ విద్యార్థి సంఘ నేతలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కన్హయ్యపై దేశద్రోహ ఆరోపణలు చేసిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. కన్హయ్య ఉగ్రవాద అనుకూల నినాదాలు చేయలేదని ఇంటిలిజెన్స్ నిఘా వర్గాలే తెలిపినందున దీనికి ప్రధాని నరేంద్ మోదీ సమాధానం చెప్పాలన్నారు.
వర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు పాకిస్తాన్‌కు అనుకూల నినాదాలు చేసినందున వారిపై దేశద్రోహ కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు కారకులైన ఏబీవీపీ, బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని వివిధ విద్యార్థి సంఘం నేతలు బి.రాములుయాదవ్, బి.ఆంజనేయులు, ఎం.అనిల్‌కుమార్ (ఏఐవైఎఫ్), ఎ.విజయ్‌కుమార్, భాస్కర్ (డీవైఎఫ్‌ఐ),హన్మేశ్ (పీవైఎల్), అనిల్‌కుమార్ యాదవ్ (యూత్ కాంగ్రెస్) డిమాండ్ చేశారు. కాగా, క న్హయ్య కుమార్‌ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీని నిర్వహించనున్నారు.