
టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, ఆయా స్థానాల్లో ప్రజాతీర్పు కోరాలని సీఎం కేసీఆర్‌ను టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు న్యాయవ్యవస్థ ముందుకు రావడం శుభపరిణామమన్నారు.ఎమ్మెల్యేల అనర్హతలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎంకు చెంపపెట్టు వంటిదన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో స్పీకర్ కార్యాలయాన్ని రాజకీయపార్టీలను చీల్చే వేదికగా మార్చుకున్న సమయంలో హైకోర్టు ఈ తీర్పునివ్వడం మంచి పరిణామమన్నారు.
టీడీపీ ఎన్నికల గుర్తుపై గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని గతంలోనే స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిని పక్కన పెట్టి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖ ఆధారంగా టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ బులిటెన్ విడుదల చేశారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించి మంత్రిగా ప్రమాణం చేసిన తలసాని శ్రీనివాసయాదవ్‌పై వేటు వేయాలని గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశామన్నారు.
రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సిన గవర్నర్, స్పీకర్ రాజకీయాలకు లోబడి రాజ్యాంగవ్యవస్థను నిర్లక్ష్యం చేశారన్నారు. అందుకే తాము న్యాయస్థానం తలుపు తట్టాల్సి వచ్చిందన్నారు. తమ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో 90 రోజుల లోపు ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొందన్నారు. స్పీకర్లు రాజ్యాంగానికి అతీతులు కారని, స్పీకర్ తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగానికి లోబడి ఉంటే ఎవరూ ప్రశ్నించే అవకాశముండదని చె ప్పారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతాయన్నారు.