
మోదం..ఖేదం
* ఆదాయ లక్ష్య సాధనలో ఆబ్కారీ శాఖ పాస్
* వాణిజ్య పన్నుల శాఖకు కాసుల పంట
* రిజిస్ట్రేషన్ల శాఖకు పెరుగుతున్న రాబడి
* రవాణా శాఖ వెనుకబాటు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో రాష్ట్ర సర్కారుకు కాసుల పంట కురిపించే వివిధ ప్రభుత్వ విభాగాల ఆదాయ పరిస్థితి చూస్తే ఈ ఏడాది కొంతమోదం.. కొంత ఖేదం అన్నట్టుగా ఉంది. రాష్ట్ర ఆవిర్భావ (జూన్ 2) అనంతర పరిణామాలు రవాణా, రిజిస్ట్రేషన్ల శాఖల ఆదాయ లక్ష్యాన్ని స్వల్పంగా దెబ్బతీసినా.. వాణిజ్య పన్నులు, ఆబ్కారీ శాఖలకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రియల్ భూమ్ తగ్గడం, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడం కొన్ని విభాగాలకు నష్టం కలిగించినా.. ఆదాయ సముపార్జనలో ఇటీవల ఆ శాఖలు క్రమంగా పుంజుకుంటుండడం విశేషం. వివిధ శాఖల ఆదాయ లక్ష్యాలు, సాధించిన పురోగతిని పరిశీలిస్తే...
వాణిజ్య పన్నుల శాఖకు పండగ
మహా నగరంలో వాణిజ్య పన్నుల శాఖకు కాసుల పంట పండుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అత్యధిక ఆదాయం వాణిజ్య పన్నుల శాఖ నుంచి సమకూరుతోంది. ఈమొత్తంలో హైదరాబాద్ నగర రాబడి అత్యంత కీలకం. ఈ శాఖలో మొత్తం 12 డివిజన్లు ఉండగా... మహా నగరంలో ఏడు ఉన్నాయి. అబిడ్స్, చార్మినార్, బేగంపేట, పంజ గుట్ట, సికింద్రాబాద్, సరూర్‌నగర్, హైదరాబాద్ రూరల్ డివిజన్ల పరిధిలోనే అత్యధిక ఆదాయం సమకూరుతోంది. గత జూన్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు (పది నెలల్లో) కేవలం ఏడు డివిజన్ల ద్వారా కనీసం రూ.19 వేల కోట్లు పన్నుల రూపంలో సమకూర్చుకోవాలనేది వాణిజ్య పన్నుల శాఖ లక్ష్యం. జనవరి 31 నాటికి రూ.13 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతం, మిగతా పన్నులతో మరో 15 శాతం ఆదాయం సమకూరుతుండడం విశేషం.
రిజిస్ట్రేషన్ శాఖలో ఆశాజనకం
ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఆదాయం అధికంగానే ఉంటోంది. ఈ శాఖ పరిధిలో మొత్తం 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో మహా నగర పరిధిలోనే నాలుగు కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం మీద రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో మహా నగర వాటా 68.89 శాతం ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ జిల్లాలోని రెండు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో రూ. 923.27 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా... జనవరి నాటికి రూ.396.58 కోట్లు ఆదాయం లభించింది. రంగారెడ్డిజిల్లా పరిధిలోని రెండు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో రూ.1361.69 కోట్లు లక్ష్యం నిర్ణయించగా... ఇప్పటి వరకు రూ.1195.22 కోట్లు సమకూరింది. రియల్ బూమ్ ఊపందుకుంటుండడంతో రాబడి మరింత పెరిగే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ శాఖ భావిస్తోంది.
రవాణా శాఖ జోరుకు బ్రేకులు
రవాణా శాఖ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రెవెన్యూ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 70 శాతమే టార్గెట్ సాధించారు. సాధారణంగా నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించి... ఆదాయాన్ని సముపార్జించే రవాణా శాఖలో రాష్ట్ర విభజన, రియల్ బూమ్ అంతంతమాత్రంగానే ఉండడం, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోకపోవడం వంటి పరిణామాలు, తనిఖీలు బాగా తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో అనుకున్న స్థాయిలో ఆదాయాన్ని సాధించలేదని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. జూన్ నుంచి జనవరి వరకు హైదరాబాద్ జిల్లా 68 శాతం, రంగారెడ్డి జిల్లా 70 శాతం లక్ష్యాలు సాధించాయి. ఆర్థిక సంవత్సరం ముగింపునకు కొద్దిసమయమే ఉన్నందున లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలన్న అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్దేశించిన టార్గెట్ రూ.499 కోట్లు కాగా.. సాధించినది రూ.340 కోట్లు. రంగారెడ్డి జిల్లాలో లక్ష్యం రూ.629 కోట్లు కాగా.. సాధించిన మొత్తం రూ.439 కోట్లుగా అధికారులు చెబుతున్నారు.
ఆబ్కారీ శాఖలో 10 శాతం వృద్ధి
గ్రేటర్ పరిధిలో ఆబ్కారీ శాఖకు కాసుల పంట పండుతోంది. గత ఏడాది జూన్ నుంచి జనవరి వరకు మద్యం అమ్మకాల్లో ప్రతి నెలా సుమారు పది శాతం వృద్ధి నమోదవుతున్నట్లు ఆబ్కారీ శాఖ అంచనా. గ్రేటర్ పరిధిలో నెలకు సుమారు రూ.200 కోట్లు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. జనవరిలోనూ ఇదే ఒరవడి కొనసాగడం విశేషం. గత నెలలో సుమారు 200 మద్యం దుకాణాలు, 225 బార్లలో సుమారు రూ.200 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్టు ఆ శాఖ అధికారుల అంచనా. గ త ఏడాది జనవరిలో అమ్మకాలు రూ.180 కోట్లు మాత్రమే. మార్చి నెల నాటికి ఇదే రీతిన మద్యం అమ్మకాలు సాగుతాయని ఆ శాఖ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్తిపన్నుదే సింహభాగం
జీహెచ్‌ఎంసీ ఆదాయ వనరుల్లో సింహభాగం ఆస్తిపన్నుదే. అంతకుముందెన్నడూ లేని విధంగా గత సంవత్సరం రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలు చేశారు. ఈసారి మరింత ఆదాయం పెంచుకునేందుకు ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే ఆస్తిపన్ను వసూళ్లపై శ్రద్ధ చూపారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం పేరిట ప్రజలకు ఇబ్బందులుంటే తొలగించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉన్న వారిపై దృషి ్టసారించి వసూళ్లను పెంచుకునేందుకు యత్నిస్తున్నారు.
గత సంవత్సరం ఇదే రోజుకు దాదాపు రూ.620 కోట్లు ఆస్తిపన్ను రాగా, ప్రస్తుతం సుమారు రూ.635 కోట్లకు చేరుకుంది. మార్చి నెలాఖరులోగా గత ఏడాదికంటే అదనంగా రూ.500 కోట్లయినా వసూలు కాగలదని భావిస్తున్నారు. ఇక టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఆదాయం గతంతో పోలిస్తే తగ్గింది. భవన నిర్మాణాలు గణనీయంగా తగ్గిపోవడమే దీనికి కారణం. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తమ ఆదాయం కూడా పెరుగుతుందని టౌన్‌ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. ట్రేడ్‌లెసైన్సులు, ఇతరత్రా మార్గాల ద్వారా గతంలో కంటే పెరిగే అవకాశాలే ఉన్నాయంటున్నారు.