గన్@ బర్త్‌డే
ఏడాదిలో ఫలక్‌నుమాలో రెండో ఘటన
చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో గతేడాది బరాత్‌లో గుర్రంపై పెళ్లి కొడుకు జరిపిన కాల్పుల ఘటన మరువకముందే మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. జన్మదిన వేడుకల్లో ఓ యువకుడు రివాల్వర్‌తో 12 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ తాజుద్దీన్ అహ్మద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.జహనుమా కాలనీకి చెందిన ప్రోగ్రెస్ పాఠశాల యజమాని మీర్జా మహ్మద్ అలీ బేగ్ కుమారుడు మీర్జా ఇబ్రహీం అలీ బేగ్(22) డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 5న అతను తన పుట్టిన రోజు వేడుకలను స్నేహితుల సమక్షంలో జరుపుకున్నాడు.
ఈ సందర్భంగా స్నేహితుల ముందు గొప్పలు చాటుకోవాలనే ఉద్దేశంతో రివాల్వర్‌తో గాల్లోకి 12 రౌండ్లు కాల్పులు జరపడమేగాక వాటిని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. గత పది రోజులుగా ఈ వీడియో వైరల్‌గా మారి సోమవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఫలక్‌నుమా ఇన్‌స్పెక్టర్ పులి యాదగిరి వీడియోను పరిశీలించి నిందితుడిని గుర్తించి అదనపు డీసీపీ కె.బాబురావు, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ తాజుద్దీన్ అహ్మద్‌లకు సమాచారం అందించాడు దీంతో వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని యువకుడి తండ్రిని పిలిపించి మాట్లాడారు. ఆరŠమ్స్ యాక్ట్ 26,27 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇబ్రహీం తండ్రి మహ్మద్ అలీ బేగ్, సోదరుడు ముస్తఫా అలీ బేగ్‌ల పేరున లైసెన్స్‌డ్ రివాల్వర్, ఫిస్టోల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.