
ఔటర్‌పై కారు బోల్తా : నలుగురి మృతి
ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి రక్తసిక్తమైంది.
- రోడ్డుపై ఎగిరిపడిన కారు
- మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు
శామీర్‌పేట్: మేడ్చెల్ జిల్లా శామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మూలమలుపు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వీరు హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ క్లాక్‌టవర్, మారెడ్‌పల్లి, తార్నాక, నాచారం ప్రాంతానికి చెందిన రాహుల్(20), మారియో(19), విగ్నేశ్(19), హర్మీందర్‌సింగ్(20)లుగా పోలీసులు గుర్తించారు. వీరు జైపూర్ యూనివర్సీటీలో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. హర్మిందర్‌సింగ్, విఘ్నేశ్,, రాహుల్, మారియోలు కారులో వీకెండ్ సరదా కోసం మేడ్చల్ వైపు వెళ్లారు.
ఆ సమయంలో శామీర్‌పేటలోని డ్రైవ్ ఇన్ దాబాలో ఉన్న హర్మిందర్‌సింగ్ వరుసకు తమ్ముడు, అతని స్నేహితులు డబ్బులు కావాలని హర్మిందర్‌కు ఫోన్ చేశారు. దీంతో మేడ్చల్ నుంచి శామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రహదారి గుండా బయలుదేరారు. దొంగల మైసమ్మ సమీపంలోని సర్వీస్‌రోడ్డు మూల మలుపు వద్దకు రాగానే వీరి కారు అదుపు తప్పి 500 అడుగుల ఎత్తు వరకు ఎగిరి పల్టీలు కొట్టింది. దీంతో కారులోని నలుగురు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న శామీర్‌పేట్ పోలీసులు 108 వాహన సిబ్బంది, స్థానికులు కలసి వాహనం నుంచి ఎగిరిపడ్డ వారిని పరిశీలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు గుర్తించి వివరాలు సేకరించారు. ఘటనాస్థలాన్ని పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ సత్తయ్యతోపాటు స్థానిక పోలీసులు వివరాలు సేకరించి గాంధీ ఆస్పత్రికి తరలించారు.