రోహిత్ వేముల ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) కోరింది.
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) కోరింది. రోహిత్ వేముల ఉద్యమాన్ని కాంగ్రెస్, సీపీఎంలు స్పాన్సర్ చేస్తున్నాయని ఆరోపించింది. శనివారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏబీవీపీ హెచ్‌సీయూ అధ్యక్షుడు పల్సానియా మాట్లాడుతూ వర్సిటీలో మాదారి వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడినప్పుడు జరగని రాద్ధాంతం..ఒక్క రోహిత్ విషయంలోనే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. రోహిత్‌కు నిజమైన న్యాయం జరిగేందుకు తాము కూడా ఉద్యమిస్తామని చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ, జేఏసీ, ఏఎస్‌ఏలు మీడియాని తప్పుదోవపట్టిస్తున్నాయని ఆరోపించారు. ఏఎస్‌ఏ యూనివర్సిటీలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని, తనపై కూడా అర్ధరాత్రి దాడికి పాల్పడిందని హెచ్‌సీయూ ఏబీవీపీ ఇన్‌చార్జి సుశీల్ కుమార్ ఆరోపించారు.
వర్సిటీలో విద్యార్థి ఉద్యమాలతో విద్యార్థుల భవిష్యత్తుని పాడుచేయొద్దని ఏబీవీపీ నాయకులు హితవు పలికారు. విద్యార్థులకు ఫ్లైట్ టిక్కెట్లు, ట్రైన్ టిక్కెట్లు, బస్సులకు డబ్బులెలా వచ్చాయని ప్రశ్నించారు. ఇదంతా స్పాన్సర్డ్ ఉద్యమం అని ఆరోపించారు. జేఏసీ విద్యార్థులు రాహుల్ దగ్గరకి ఖాళీ చేతుల్తో వెళ్ళి, సూట్‌కేసులు మోసుకొచ్చారని ఆరోపించారు. సమావేశంలో కుమార్ నాయక్, కిరణ్ గుండాల, భానుప్రతాప్ సింగ్, హరిత పాల్గొన్నారు.