రుణం పొందేందుకు బ్యాంకు పాలకమండలి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు రుణాలందించే స్త్రీనిధి బ్యాంకుకు తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్(టీఎస్‌కాప్) రూ.100 కోట్లను రుణంగా ఇవ్వనుంది. టీఎస్‌కాప్ నుంచి రుణం పొందేందుకు ఆమోదం తెలుపుతూ స్త్రీనిధి బ్యాంక్ పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
సమావేశంలో బ్యాంకు మేనేజింగ్ డెరైక్టర్ జీవీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. నాలుగేళ్లలో స్త్రీనిధి బ్యాంకు ద్వారా రాష్ట్రంలోని 2.11 లక్షల స్వయం సహాయక గ్రూపుల్లోని 11.61 లక్షల మంది మహిళలకు రూ.2,360 కోట్ల రుణాలను అందజేశామన్నారు. ఎస్‌హెచ్‌జీల నుంచి డిపాజిట్లు, ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లుపోనూ తొమ్మిది జాతీయ బ్యాంకుల నుంచి రూ.709 కోట్లు రుణాలను తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రుణ ప్రణాళికలో రూ.1,050 కోట్లు రుణ లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ. 945 కోట్లకుపైగా రుణాలను అందజేశామన్నారు. రుణాలను అందజేయడంతో పాటు రికవరీలోనూ మంచి(98 శాతం) పురోగతి సాధించామని వివరించారు. బ్యాంకు అభివృద్ధిని, స్వయం సంఘాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలకమండలి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. సమావేశంలో పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సెర్ప్ సీఈవో అనితారాంచంద్రన్, మెప్మా ఏఎండీ విద్యాధర్, తొమ్మిది జిల్లాల(హైదరాబాద్ మినహా) మహిళా సమాఖ్యల అధ్యక్షులు పాల్గొన్నారు.
పాలకమండలి నిర్ణయాలివీ..
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ప్రతి జిల్లాలోనూ పనితీరు బాగున్న మూడు మండల సమాఖ్యలకు, ఒక పట్టణ సమాఖ్యకు అవార్డులు అందజేయాలని నిర్ణయించారు. స్త్రీనిధి ద్వారా రుణం పొంది ఏర్పాటు చేసుకున్న దుకాణాలు, పరిశ్రమలకు ‘స్త్రీనిధి బ్యాంకు సహకారంతో’ ఏర్పాటు చేసిన సంస్థలుగా బోర్డులు పెట్టాలని నిర్ణయించారు.
మార్చిలోగా రాష్ట్రంలో 630 వన్‌స్టాప్ షాప్(పల్లె సమగ్ర సేవా కేంద్రాలు)లను ఏర్పాటు చేయాలని, ఆయా కేంద్రాలకు అవసరమైన కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయాలను వెంటనే కల్పించాలని, కేంద్రాలను నిర్వహించే వీఎల్‌ఈ(విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రైనర్)లకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.
‘స్త్రీనిధి’కి టీఎస్‌కాప్ రూ.100 కోట్ల రుణం
Published Sun, Feb 28 2016 3:37 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM
Advertisement