తెలంగాణలో చార్జీల మోత | RTC and electricity charges, says KCR | Sakshi
Sakshi News home page

తెలంగాణలో చార్జీల మోత

Published Thu, Jun 23 2016 2:53 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

తెలంగాణలో చార్జీల మోత - Sakshi

తెలంగాణలో చార్జీల మోత

విద్యుత్, ఆర్టీసీలో పెంపు ప్రతిపాదనలకు సీఎం ఆమోదం
సామాన్యులపై భారం పడకుండా పెంచాలని ఆదేశం
పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ. లోపు రూ.1 పెంపు
30 కి.మీ.పైన ఎంత దూరమైనా రూ.2 వడ్డన
మిగతా బస్సుల్లో పది శాతం మేర వాత
వంద యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీల పెంపు లేదు
వంద యూనిట్లు దాటితే బాదుడే
ఆర్టీసీ, విద్యుత్ సంస్థల నష్టాలపై కేసీఆర్ సమీక్ష

 
సాక్షి, హైదరాబాద్
విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సామాన్య ప్రజలపై అదనపు భారం పడకుండా చార్జీలు పెంచుకునేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు విద్యుత్ సంస్థలకు అనుమతి ఇచ్చారు. గృహ విద్యుత్‌ను వంద యూనిట్ల లోపు వినియోగించే వారికి చార్జీలను పెంచవద్దని ఆదేశించారు. వంద యూనిట్ల కంటే ఎక్కువ వాడే గృహ వినియోగదారులకు స్వల్పంగా చార్జీలు పెంచాలని సూచించారు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించే చర్యల్లో భాగంగా బస్సు చార్జీల పెంపు ప్రతిపాదనలకు కూడా సీఎం అంగీకరించారు. పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల లోపు ఒక్క రూపాయి, 30 కిలోమీటర్లపైన ఎంత దూరమైనా రూ.2 పెంచాలని అధికారులకు సూచించారు. మిగతా బస్సుల్లో చార్జీల పెంపు పది శాతం మించకూడదని ఆదేశించారు.

ఆర్టీసీ, విద్యుత్‌పై బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఆర్టీసీకి, విద్యుత్ సంస్థల ఆదాయ వ్యయాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం, వస్తున్న నష్టాలను ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా ఈ రెండు శాఖల అధికారులు సమర్పించిన చార్జీల పెంపు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి క్షుణ్నంగా పరిశీలించారు. సామాన్యులపై భారం పడకుండా చార్జీల పెంపు ఉండేలా తుది ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఇతర ప్రాంతాల్లో పర్యటనలో ఉండటంతో చార్జీల పెంపుపై గురువారం ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించనుంది.

ప్రజలు కొంత భారం మోయాలి
ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, విద్యుత్, సింగరేణిలను బలోపేతం చేసేందుకు ఆర్థిక చేయూతను అందించటంతోపాటు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సీఎం చెప్పారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోనందున ఆర్టీసీ, విద్యుత్ సంస్థలు కునారిల్లిపోయాయని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ ఎప్పుడు మూత పడుతుందా అనే భయాందోళన ఉండేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం అనుసరించిన విధానాలతో విద్యుత్, ఆర్టీసీ సంస్థలు కోలుకున్నాయని, ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాయన్నారు. ఇప్పటికీ నష్టాలున్నందున వాటి  నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులు, ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వం చేయాల్సినంత సాయం చేస్తుందని, అదే సమయంలో ప్రజలు కొంత భారం మోయాల్సి వస్తుందని వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో 86 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లుంటే.. అందులో 60 లక్షల కనెక్షన్లు వంద యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం కేటగిరీలో ఉన్నాయి. దీంతో చార్జీల పెంపు భారం ఎక్కువ మంది వినియోగదారులపై ఉండదు’’ అని అన్నారు.

పరిశ్రమలకు 7 శాతం చాలు
పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయటంతో విద్యుత్ సంస్థలపై ఎక్కువ భారం పడింది. ఈ భారాన్ని కొంత మేరకు పంచుకోవాలని విద్యుత్ సంస్థల అధికారులు పరిశ్రమల యజమానులతో చర్చించారు. పరిశ్రమల విద్యుత్‌కు పది శాతం చార్జీలు పెంచడం తమకు ఆమోదయోగ్యమేనని వారు చెప్పిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడున్న చార్జీలే ఎక్కువగా ఉన్నందున పరిశ్రమలకు 10 శాతం కాకుండా.. 7 శాతం లోపు పెంపు ఉండాలని సీఎం సూచించారు.

పల్లె ప్రజలపై భారం వద్దు
రాష్ట్రంలో సగం మంది ప్రయాణికులు పల్లె వెలుగు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. రోజుకు 90 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తుంటే.. అందులో 45 లక్షల మంది పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్లెవెలుగు చార్జీలను పెద్దగా పెంచవద్దని సీఎం ఆదేశించారు.

విద్యుత్ నష్టాలకు కారణాలివీ..
విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు అదనపు సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ల నిర్మాణం చేపట్టినట్లు సీఎం పేర్కొన్నారు. ఇందుకు రెండు డిస్కమ్‌లు, ట్రాన్స్‌కో కలిపి రూ.2,144 కోట్లు అప్పులు చేసినట్లు వివరించారు. ‘‘గతేడాది జల విద్యుత్ ఉత్పత్తి కాలేదు. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీనికి గత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సంస్థలు రూ.2,700 కోట్లు ఖర్చు పెట్టాయి. ప్రభుత్వం విద్యుత్ సిబ్బందికి వేతనాలు పెంచింది. ఈ భారం కూడా విద్యుత్ సంస్థలపై పడింది. రైతులకు పగటిపూట 9 గంటల కరెంటు ఇచ్చేందుకు విద్యుత్ సంస్థలు రూ.2,400 కోట్ల ఖర్చుతో సబ్‌స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, ఇతర కార్యక్రమాలు చేపట్టాయి’’ అని వివరించారు.

ఆర్టీసీని కాపాడేందుకు చర్యలు
ప్రస్తుతం ఆర్టీసీకి రూ.2,275 కోట్ల అప్పు ఉంది. ప్రతి నెలా నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఆర్టీసీని నడిపేందుకు చివరకు ఉద్యోగుల కో ఆపరేటివ్ సొసైటీ నుంచి రూ.180 కోట్లు తీసుకోవాల్సి వచ్చింది. ఈ దుస్థితి నుంచి కాపాడేందుకు ఆర్టీసీకి రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని నిర్ణయించారు. ప్రతి నెలా రూ.75 కోట్ల చొప్పున ప్రభుత్వ సాయం అందిస్తున్నారు. అలాగే 1,200 బస్సులు కొనుగోలుకు ప్రభుత్వం రూ.300 కోట్ల వరకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement