ఎమ్మెల్యేరాజ్..! | Ruler party MLAs, incharges warnings to officers | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేరాజ్..!

Published Sun, May 8 2016 2:33 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

ఎమ్మెల్యేరాజ్..! - Sakshi

ఎమ్మెల్యేరాజ్..!

కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జుల హల్‌చల్
-  కింది స్థాయి ప్రజాప్రతినిధులకు అవమానాలు, బెదిరింపులు
-    అధికారులతో ఘర్షణలు.. తమ ‘పని’ చేయకుంటే బదిలీ చేయిస్తామని బెదిరింపులు
-    ఓ కాలేజీ యజమానిని చంపుతానని బెదిరించిన నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం
-    మాట వినకపోతే జైలులో పెట్టిస్తా.. కాంట్రాక్టర్‌కు వేణుగోపాలాచారి హెచ్చరిక
-   కాంట్రాక్టర్‌ను నోటికొచ్చిన బూతులు తిట్టిన మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
-    ఫ్లెక్సీలో తన ఫొటో పెట్టలేదంటూ సొంత పార్టీ కార్పొరేటర్‌పైనే ఎల్‌బీనగర్ ఇన్‌చార్జి రామ్మోహన్ వీరంగం
-    అధికారులపై దౌర్జన్యానికి దిగిన మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేలు
-    25 మంది ఎమ్మెల్యేల కర్ర పెత్తనంపై సర్కారుకు నిఘా వర్గాల నివేదిక

 
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తమదనే తెంపరితనం.. మంత్రులు తమ వాళ్లనే మిడిసిపాటు.. తామేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో కొందరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు రెచ్చిపోతున్నారు. ప్రజాప్రతినిధులమని మరిచిపోయి విచ్చలవిడిగా.. వ్యవహరిస్తున్నారు. తమ మాట వినని అధికారులు, కింది స్థాయి ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు. ‘అంతుచూస్తాం.. చంపేస్తాం.. జైలుకు పంపుతా’మంటూ హింసిస్తున్నారు. కమీషన్లు ముట్టజెప్పనిదే పనులు చేయడానికి వీల్లేదంటూ కాంట్రాక్టర్లను దోచుకుంటున్నారు. అంతేకాదు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకూ తమ ‘కక్కుర్తి’తో అడ్డం పడుతున్నారు. ఒకరిద్దరు కాదు ఏకంగా 25 మంది అధికార పార్టీ శాసనసభ్యులు, మరో డజను మంది వరకూ నియోజకవర్గ ఇన్‌చార్జులు ఇలా వ్యవహరిస్తున్నట్లుగా నిఘా వర్గాలు ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
 
 సామంత రాజులా..?: ఒక్క మాటలో చెప్పాలంటే కొందరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు తమ నియోజకవర్గాల్లో సామంత రాజులుగా చలామణి అవుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకునేందుకు నిఘా వర్గాలు చేసిన ప్రయత్నంతో ఈ నేతల అవినీతి, అక్రమ వ్యవహారాలెన్నో బయటపడ్డాయి. గ్రామాల్లో సర్పంచ్ అయినా, నగరాల్లో కార్పొరేటర్ అయినా వారి చెప్పుచేతల్లో ఉండాల్సిందే. మండలంలో ఎమ్మార్వో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ఎవరైనా సరే వారి మాటను వేదంగా పరిగణించాల్సిందే. లేదంటే బదిలీ వేటు పడుతుందని బెదిరిస్తారు. అప్పటికీ వినకపోతే అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ప్రచారం చేస్తారు.
 
 దాదాపు అన్ని జిల్లాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక పంచాయితీల్లో సెటిల్‌మెంట్లు చేయడం, పంచాయితీకి పిలిచినా రానివారిని బూతులు తిట్టడం, వాట్సప్‌లో తమకు వ్యతిరేకంగా వచ్చే పత్రికల క్లిప్పింగ్‌లు పెడుతున్నారని బెదిరించడం, చెప్పినట్లు చేయకపో తే జైలులో పెట్టిస్తానని బెదిరించడం నిత్యకృత్యంగా మారిపోయాయి. చెప్పిన పని చేయలేదని అధికారులపై చేయి చేసుకున్న మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల తీరు ఇప్పటికే వివాదాస్పదమైంది. ఓ ఎమ్మెల్యే అటవీ అధికారిపై చేయి చేసుకుంటే, మరో మహిళా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మార్వోను ఇంటికి పిలిచి బూతులు తిట్టారు. ఇప్పుడు మరికొందరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతల బెదిరింపు ఫోన్ సంభాషణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
 నీ సంగతి తేలుస్తా.. చంపుతా..
 కాలేజీ యజమానికి నకిరేకల్ ఎమ్మెల్యే బెదిరింపులు
నకిరేకల్ నియోజకవర్గంలో ఓ కాలేజీ నిర్వాహకుడు వీరయ్యను పంచాయితీకి రావాలని అక్కడి ఎమ్మెల్యే వీరేశం హుకుం జారీ చేశారు. ఆ పంచాయితీకి బాధ్యులైన వారితో పరిష్కరించుకుంటామని వీరయ్య చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే వీరేశం ఆగ్రహంతో ‘అంతు తేలుస్తా’నంటూ బెదిరించారు. మొత్తం 3 సార్లు వీరయ్యకు ఫోన్‌లో చేసిన బెది రింపుల సంభాషణలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
 
 ‘రమ్మంటే రావడం లేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడకు వస్తా. డ్రామాలు ఆడుతున్నావారా... కొడుకా నీ సంగతి తేలు స్తా’ అంటూ హెచ్చరించారు. ‘నువ్వెక్కడున్నా వచ్చి కొడతా.. తెలుసుకో నా గురించి.. వచ్చి చంపుతా..’ అని బెది రించారు. నియోజకవర్గంలో కింది స్థాయి ప్రజాప్రతినిధులను ఈ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని, అధికారులను అవమానిస్తున్నారని ఆరోపణలున్నాయి.
 
‘చెప్పినట్లు వినకపోతే జైలుకు పంపుతా..’
ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించిన సీనియర్ నేత వేణుగోపాలాచారి
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సముద్రాల వేణుగోపాలాచారి సీనియర్ నేత. మాజీ కేంద్రమంత్రి. ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న ఆయన ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో టెండర్ తీసుకుని పనులు చేస్తున్న ఓ కాంట్రాక్టర్‌ను పని ఆపేయాలని ఒత్తిడి తెచ్చారు. చెప్పినట్లు వినకపోతే లోపలకు (జైలుకు) పంపుతానంటూ బెదిరించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెబితే పని ఆపేస్తానని కాంట్రాక్టర్ పేర్కొనడంతో.. ‘నేను చెపితే వినవా.. అంతు చూస్తా.. నేను చెపుతున్నా. ప్రభుత్వం మాది. మేము చెప్పినట్లు విను. ఇష్టం లేకపోతే కోర్టుకు పో. అంతేగానీ తమాషా చేయకు. చెప్పినట్లు వినలేదో ఇబ్బంది పడతావు’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
 
 హుషారీ చేస్తే పరేషాన్ అయితవు: రామ్మోహన్
ఎల్‌బీనగర్ నియోజకవర్గం హయత్‌నగర్ కార్పొరేటర్ తిరుమల్‌రెడ్డి తన డివిజన్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నియోజకవర్గ ఇన్‌చార్జి రామ్మోహన్‌గౌడ్ ఫొటోను చిన్నగా పెట్టారట. దీంతో రామ్మోహన్ తిరుమల్‌రెడ్డికి ఫోన్ చేసి ‘ఫ్లెక్సీలో నా ఫొటో పెట్టవా’ అని దబాయించారు. ఫొటో ఉంది కదాని కార్పొరేటర్ సమాధానమిస్తే... ‘చిన్నగా పైన పెడుతవా.. నీది, జగదీశ్‌రెడ్డి (మంత్రి) ఫొటోలు పెద్దగా పెట్టుకుని నన్ను అవమానిస్తావా.. ఇదిగో చెబుతున్నా.. నీకు జగదీశ్‌రెడ్డి ఉండొచ్చు. నా వెంట సీఎం ఉన్నడు. ఏం ఎమ్మెల్యే అయితనని చెప్పుకుంటున్నవంట. హుషారీ చేస్తే పరేషాన్ అయితవు. నువ్వు కార్పొరేటర్ టికెట్ కొనుకున్నవని నాకు తెలుసు. ఈ సంగతి మీడియాను పిలిచి చెబుతా..’ అని బెదిరించారు.
 
 ‘కొడుకా నీ సంగతి చెపుతా..’ 

కాంట్రాక్టర్‌పై మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వీరంగం
మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అసైన్డ్ భూములపై కన్నేశారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని స్థానికంగా ఉండే కాంట్రాక్టర్ ప్రసాద్‌గౌడ్ వాట్సప్ గ్రూపులో పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సదరు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ‘ఎవడో పేపరోడు రాస్తే దానిని వాట్సప్‌లో పెడతవా.. ఎవరి ఏరియా అనుకుంటున్నావు.
 
 నా కొడుకా... ఎట్లా పెట్టినవురా, నీ సంగతి చెప్తా, ఫిర్యాదు చేసి లోపల (జైల్లో) వేయిస్తా..’ అంటూ బూతు పురాణం అందుకున్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు వాట్సప్ గ్రూపుల్లో పెట్టడం ఇటీవల సాధారణమైపోయింది. అది నేరంకూడా కాదు. కానీ మేడ్చల్ ఎమ్మెల్యే ఇదేమీ పట్టించుకోకుండా ‘నా ఏరియాలో ఉంటూ ఇలా చేస్తావా..’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు.
 
మిషన్ కాకతీయకూ ఆటంకాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులకూ పలువురు ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. అంచనా కంటే 20 శాతానికిపైగా లెస్‌కు టెండర్లు తీసుకున్న కాంట్రాక్టర్లు సైతం స్థానిక ఎమ్మెల్యేకు సొమ్ము ముట్టజెపితే తప్ప పని మొదలుపెట్టలేరు. ఇటీవలే రాష్ట్రస్థాయి అధికారిక పదవి చేపట్టిన నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఒకాయన దెబ్బకు కాంట్రాక్టర్లు పారిపోతున్నారు. పనిచేయకపోయినా ఫర్వాలేదుగానీ ఆ ఎమ్మెల్యే బెదిరింపులు భరించలేమంటూ చాలా మంది పనులే ప్రారంభించలేదు. నల్లగొండ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ కాకతీయ టెండర్‌లో పాల్గొనడం కోసం కూడా అక్కడి ఓ ఎమ్మెల్యేకు ముడుపులు సమర్పించుకోవాలి. ఇలా అన్ని జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement