సభలో ‘సంస్కారం’ రగడ
♦ సంస్కారం లేనివారు సభ నడుపుతున్నారంటారా
♦ సారీ చెప్పకుంటే సస్పెండ్ చేస్తాం
♦ డీకే అరుణ సస్పెన్షన్‌కు సిద్ధపడ్డ అధికారపక్షం
♦ సర్దిచెప్పేందుకు యత్నించిన జానా
♦ డిప్యూటీ స్పీకర్‌పై ఆ వ్యాఖ్యే చేయలేదన్న డీకే అరుణ
♦ సస్పెన్షన్ ప్రతిపాదనను వారించిన డిప్యూటీ స్పీకర్
♦ తీవ్ర ఆవేదనకు గురైన పద్మా దేవేందర్‌రెడ్డి.. కంటతడి
సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా ప్రశాంతంగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఆగ్రహావేశాలు చోటుచేసుకున్నాయి! ‘సంస్కారం’పై రాజుకున్న వివాదం ఓ మహిళా సభ్యురాలి సస్పెన్షన్ ప్రతిపాదన వరకు వెళ్లింది. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరకు ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి కలగజేసుకుని.. సస్పెన్షన్ కాకుండా పరిస్థితిని చక్కదిద్దారు. ఉప సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అంశంపై ఈ గొడవ మొదలుకాగా.. చివరకు ఉప సభాపతే దాన్ని సద్దుమణిగేలా చేయటం విశేషం. కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ... ఉప సభాపతిని ఉద్దేశించి ‘సంస్కారం లేనివారు సభను నడుపుతుంటే ఇట్లాగే ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారన్న విషయంపై ఈ గొడవ మొదలైంది.
ఏం జరిగింది?
నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ శాఖల పద్దులపై కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా.. సమయం మించిపోయిందంటూ స్పీకర్ స్థానంలో ఉన్న ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి మైక్ కట్ చేసి అధికారపక్ష సభ్యుడికి అవకాశం ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు మొదటి వరుస సీట్ల వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అయినా మైక్ ఇవ్వకపోవడంతో సభ నుంచి నిష్ర్కమించి, కొద్దిసేపటి తర్వాత సభలోకి వచ్చారు. ‘‘సభ్యులు మాట్లాడేటప్పుడు ప్రభుత్వానికి సూచనలు చేయటం, ఏవైనా తప్పులుంటే ఎత్తి చూపటం వరకు సరేగానీ..’’ అంటూ జానారెడ్డి పేర్కొంటుండగా పద్మాదేవేందర్‌రెడ్డి కలగజేసుకున్నారు. ‘‘సంస్కారం లేని వారు సభ నడిపితే ఇలానే ఉంటుంది..’’ అని సీనియర్ సభ్యురాలు (డీకే అరుణ) అన్నారని, అలా అనవచ్చా అంటూ ఎదురు ప్రశ్నించారు.
ఆమె బహిరంగ క్షమాపణ చెప్పకుంటే చర్య తప్పదని హెచ్చరించారు. వెంటనే మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుని... ‘‘జానారెడ్డి గారూ మీరంటే మాకు గౌరవం. మీ సభ్యురాలు అనుచితంగా మాట్లాడినందున ఆమెతో బహిరంగంగా క్షమాపణ చెప్పిస్తే హుందాగా ఉంటుంది. లేకుంటే చర్య తప్పదు’’ అని అన్నారు. ‘‘మా ప్రభుత్వం బాగా చేస్తోందని చెప్పుకోవటంలో తప్పు లేదు. కానీ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలే పనిగా పెట్టుకోవటం సరికాదు. దానివల్లే ఆరోపణలు-ప్రత్యారోపణలు వస్తున్నాయి. సభ ముగిసే వేళ ఆవేశాలు వద్దు. దాన్ని అక్కడితో వదిలేద్దాం’’ అని జానా సర్దిచెప్పారు.
వారి విచక్షణకే వదిలేద్దాం..
తాను అసలు ఆ వ్యాఖ్యే చేయలేదని, అధికార పక్ష సభ్యులే తమ పట్ల అనుచితంగా మాట్లాడారని డీకే అరుణ పేర్కొన్నారు. కావాలంటే రికార్డులు చూసుకోవచ్చని పేర్కొన్నారు. దీంతో మంత్రి హరీశ్.. లేచి ఆమెపై సస్పెన్షన్ ప్రతిపాదనకు మరోసారి సిద్ధపడగా పద్మా దేవేందర్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఈ అంశాన్ని సభ్యురాలి విచక్షణకే వదిలేద్దామంటూ వారించారు. ఈ సమయంలో పద్మా దేవేందర్‌రెడ్డి పలుమార్లు ఆవేదనకు గురై కంటతడి తుడుచుకున్నారు.
ఎప్పుడూ వాళ్లదే నడుస్తదా?: డీకే
‘‘నడుస్తున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎప్పుడూ వాళ్లదే నడుస్తదా? ఇంతకంటే పెద్దపెద్ద సామ్రాజ్యాలు కనిపించకుండా పోయినయి. చూద్దాం మూడేళ్ల తర్వాత ఏమైతదో?’’ అని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. అసెంబ్లీ లాబీల్లో మంగళవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తాను డిప్యూటీ స్పీకర్‌పై అనుచితంగా మాట్లాడినట్టుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు.
పక్క సభలో చూస్తున్నారు కదా?
‘‘19 మంది సభ్యులున్న మీరు గంటకుపైగా మాట్లాడితే 80 మంది సభ్యులున్న మేం 48 నిమిషా లే మాట్లాడాం. ఇంకా సమయం కావాలని పట్టుపట్ట డం.. ఇవ్వకుంటే అనుచితంగా మాట్లాడ్డం, రన్నింగ్ కామెంట్రీ, బయటకు వెళ్లి రావటం ఏంటిది?’’ అని హరీశ్ కాంగ్రెస్ సభ్యులనుద్దేశించి ప్రశ్నించారు. ‘‘గతంలో మైక్ విరిచిన సంస్కృతి ఆమె(అరుణ)ది. ఇప్పుడేమో ఉపసభాపతి పట్ల అనుచిత వ్యాఖ్యలు. పక్క రాష్ట్ర సభ(ఏపీ)లో చూస్తున్నారు కదా.. ఆఫ్ ది రికార్డులో మాట్లాడిన వాటిపై ఓ సభ్యురాలిని ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. మేం దాన్ని కోరుకోవటం లేదు. గతంలో మా సభ్యులు అనుచితంగా వ్యవహరిస్తే క్షమాపణ చెప్పించాం.
ఇప్పుడు ఆమె కూడా క్షమాపణ చెప్పాలి’’ అని స్పష్టంచేశారు. ఈ సమయంలో జానా జోక్యం చేసుకుని.. గతంలో తాను కూడా డీకే అరుణ, సంపత్‌లతో క్షమాపణ చెప్పించానన్నారు. ఎవరి విజ్ఞతకు వారికి వదిలేయాలని, వారే ఆత్మవిమర్శ చేసుకుంటారన్నారు. తమనేమన్నా ఊరుకుంటామని.. కానీ స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడితే ఊరుకోమని హరీశ్‌రావు పేర్కొన్నారు. అరుణను సస్పెండ్ చేయాల్సిందేనని అధికార సభ్యురాలు గొంగిడి సునీత డిమాండ్ చేశారు. దీంతో మంత్రి హరీశ్ సస్పెన్షన్ ప్రతిపాదించేందుకు సిద్ధపడ్డారు. అరుణకు చివరి అవకాశం ఇస్తున్నానని, క్షమాపణ చెప్పాలని సూచించారు.