ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి పావలా కోడికి ముప్పావలా మసాలా ఖర్చు చందంగా ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఇందిర భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం రూ. 300 కోట్ల ఒప్పందాలు చేసుకొని అందుకు ప్రచార నిమిత్తం వెయ్యి కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. సీఆర్‌డీఏ చైర్మన్‌గా సీఎం చంద్రబాబు తన ప్రయోజనాలకు సంబంధించిన డాక్యుమెంట్లపై మాత్రమే సంతకాలు చేస్తూ వాటి పనులు మాత్రమే వేగవంతం అయ్యేలా చేస్తున్నారన్నారు.
ఒక పక్క ప్రభుత్వ భూములను సింగపూర్ కంపెనీలకు ఇస్తూనే రూ. 5,500 కోట్లతో మౌళిక వసతులను కల్పించడానికి పలువురితో ఒప్పందాలు కుదుర్చుకున్నాడని పేర్కొన్నారు. రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ సంస్థను తొలగిస్తే అపరాధ రుసుం కింద 20 శాతం చెల్లించాలనే నిబంధనను సవరించాలనే ఆర్థిక శాఖ అభ్యంతరానికి చంద్రబాబు ఎందుకు మిన్నకుండి పోయారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ కంపెనీలు అసెండాస్, సిన్‌బ్రిడ్జ్, సెంబ్ కార్బలతో ప్రభుత్వం చేసుకున్న స్విస్ ఛాలెంజ్ ఒప్పందాలను తీవ్రంగా తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు.
రైతులను బెదిరించి పోలీసులు, తహసీల్దార్లు, ఆర్డీవోల ద్వారా బలవంతంగా భూములను సేకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సేకరించిన భూముల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములు కూడా ఉన్నాయన్నారు. విభజన చట్టంలో హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉండాలని పొందుపరచినా అర్థాంతరంగా తన ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.