‘సాక్షి’ ప్రాపర్టీ షో మొదలైంది
సందర్శకులతో కిటకిటలాడిన ప్రాంగణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగరం నలువైపులా నిర్మాణం జరుపుకుంటున్న అపార్ట్‌మెంట్లు, వెంచర్ల వివరాలను కొనుగోలుదారులకు చేరువ చేసేందుకు ‘సాక్షి’ప్రాపర్టీ షో వేదికగా మారింది. శనివారమిక్కడ ఘనంగా ప్రారంభమైన మెగా ప్రాపర్టీ షోలో హైదరాబాద్‌కు చెందిన 23 ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొన్నాయి. ఉదయం 10 గంటల నుంచే కుటుంబంతో సహా సందర్శకులు ప్రదర్శనకు విచ్చేశారు. ప్రతి స్టాల్ వద్ద ప్రాజెక్టుల వివరాల సేకరణ, ఎంపికలో వారు బిజీబిజీగా కనిపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కమిషనర్ టి.చిరంజీవులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 10 మిలియన్లు. 2040 నాటికి 22 మిలియన్లకు చేరుతుంది. అప్పటి జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతుల ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది’అని చెప్పారు. హైదరాబాద్‌లో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు, ఈ–కామర్స్ సంస్థలూ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయని అన్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఐకియా వంటి విదేశీ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని.. దీంతో కార్యాలయాల సముదాయాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని చెప్పారు. కార్యక్రమంలో భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి, జనరల్ సెక్రటరీ రామచంద్రారెడ్డి, అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ బ్రాండ్ ప్రమోషన్ మేనేజర్ శ్రీనివాస్ దివాకర్ల, సాక్షి డైరెక్టర్లు వైఈపీ రెడ్డి (ఫైనాన్స్ అండ్ అడ్మిన్), కేఆర్‌పీ రెడ్డి (అడ్వర్టయిజింగ్) తదితరులు పాల్గొన్నారు.