పెళ్లికొడుకు ఆయుష్ శర్మ
ఫలక్‌నుమాకు పెళ్లికళ
నేడు మధ్యాహ్నం ముహూర్తం, రేపు విందు
అమితాబ్, షారుఖ్, ఆమిర్, రజనీ, కమల్ వచ్చే అవకాశం
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సోదరి అర్పిత ఖాన్ వివాహ వేడుక కోసం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సోమవారం సాయంత్రం సల్మాన్‌ఖాన్‌తో పాటు పెళ్లికొడుకు ఆయుష్ శర్మ కుటుంబసభ్యులంతా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వివాహ వేడుక నిర్వహించనున్నారు. బుధవారం అతిథులందరికీ విందుభోజనం ఉంటుంది. వధూవరులిద్దరూ ముంబైకి చెందిన వారైనప్పటికీ చారిత్రక ఫలక్‌నుమాలో పెళ్లి వేడుక కోసం ఆర్నెల్ల క్రితమే ప్యాలెస్‌లోని అన్ని గదులను రిజర్వు చేసుకున్నారు.
ఈ వేడుక కోసం బాలీవుడ్ మొత్తం హైదరాబాద్‌కు చేరుకుంటోంది. ఇప్పటికే కొందరు నగరానికి చేరుకోగా.. మంగళవారం పెళ్లి వేడుకకు అమితాబచ్చన్, షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, రజనీకాంత్, కమలహాసన్ వంటి సూపర్ స్టార్లతో పాటు అగ్రశ్రేణి తారాగణమంతా హాజరవుతుందని సమాచారం. రాజకీయ ప్రముఖులు కూడా రానున్నారు. ఇక నగరంలో అతికొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే ఫలక్‌నుమా ప్రాంతంలో సందడి నెలకొంది. విద్యుత్ దీపాలతో ప్యాలెస్ మెరిసిపోతోంది. దాని చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు కూడా ఇక్కడకు చేరుకుంటున్నారు. కాగా, పెళ్లి కూతురు అర్పితాఖాన్ సోమవారం ఉదయం నుంచిసాయంత్రం వరకు చుడీబజార్, చార్మినార్ పరిసరాల్లో ఎవరికంటా పడకుండా సాధారణ వ్యక్తిలా షాపింగ్ చేసినట్లు తెలిసింది. పెళ్లి విందు కోసం బిర్యానీతో పాటు పలు రకాల వంటకాలను ప్యారడైజ్ హోటల్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం.