చెల్లి పెళ్లి వేదికకు రూ.2 కోట్ల ఖర్చు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సోదరి పెళ్లి చాలా భారీగా చేయబోతున్నాడు. ముద్దుల చెల్లెలు అర్పితాఖాన్ పెళ్లి చేయడానికి.. కేవలం ఒక్క వేదిక కోసమే అక్షరాలా రెండు కోట్లు ఖర్చు పెడుతున్నాడట. అది కూడా కేవలం రెండు రోజులకు చెల్లిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్లో అర్పితాఖాన్ వివాహం ఈనెల 18న జరగనున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుక కోసం అరవై గదులున్న ఈ ప్యాలెస్ మొత్తాన్ని రెండు కోట్లు చెల్లించి సల్మాన్ బుక్ చేశారట. ఇక డెకరేషన్కు మళ్లీ విడిగా చెల్లించాల్సిదేనట. ఖాన్ పరివారం అంతా నవంబర్ 18నే నగరానికి చేరుకుంటుంది. పెళ్లి వేడుక అనంతరం 20వ తేదీన ముంబై తిరిగి వెళతారు.
కాగా షాదీ వేడుకకు సుమారు 250 మంది అతిథులను ఆహ్వానించినట్లు పెళ్లికుతూరు అర్పిత సన్నిహితులు తెలిపారు. ఇప్పటికే సల్మాన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ టాలీవుడ్ హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు ఈ ఆహ్వానాన్ని అందుకున్నారు. వెంకటేష్ ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. అయితే సురేష్ బాబు మాత్రం ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉండటంతో ఆయన హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది.
ఇక వరుడు ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆయుష్ శర్మ. వీళ్లిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. ఇంకేముంది పెళ్లి ధూంధామ్గా చేయాలని నిర్ణయించారు. ఈ వివాహం ముస్లిం, హిందూ సంప్రదాయాల ప్రకారం జరగబోతున్నట్లు సమాచారం. నవంబర్ 18న సల్మాన్ తల్లిదండ్రులు సలీమ్ ఖాన్, సల్మా ఖాన్‌ల పెళ్లిరోజు. సరిగ్గా అదేరోజున అర్పిత పెళ్లి చేస్తున్నారు.