ఉన్నచూపూ పోయింది | Seven died by neglecting doctors giving saline bottle | Sakshi
Sakshi News home page

ఉన్నచూపూ పోయింది

Published Thu, Jul 7 2016 2:24 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

ఉన్నచూపూ పోయింది - Sakshi

ఉన్నచూపూ పోయింది

ఆపరేషన్ తర్వాత కంటిచూపు కోల్పోయిన ఏడుగురు.. సరోజినీదేవి ఆసుపత్రిలో దారుణం
సర్జరీ అనంతరం వాడిన సెలైన్ బాటిల్‌లో బ్యాక్టీరియానే కారణం!
ప్రాథమికంగా తేల్చిన వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖ
ఈ ఘటనపై సమగ్ర విచారణకు ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ
బ్యాక్టీరియా ఉన్న 13.07 లక్షల బాటిళ్లు రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులకు సరఫరా
సెలైన్ బాటిళ్లు సరఫరా చేసింది నాగ్‌పూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాసూటికల్స్ కంపెనీ
కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ప్రభుత్వం
బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతాం: లక్ష్మారెడ్డి
వైద్యులపై  హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు

 
సాక్షి, హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యమో... సెలైన్ బాటిల్‌లో బ్యాక్టీరియానో... కారణం  ఏదైతేనేం.. ఏడుగురి జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి! కంటిచూపు మందగించిందని ఆసుపత్రికి వెళ్తే ఉన్న చూపూ పోయింది! కంటి శుక్లాలకు చేసే క్యాటరాక్ట్ ఆపరేషన్‌తో ఆ అభాగ్యులు వెలుగులకు దూరమయ్యారు.  సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆపరేషన్ వికటించి చూపు కోల్పోయిన వారంతా 50 ఏళ్లకు పైబడిన వారే. శస్త్రచికిత్స అనంతరం కళ్లను శుభ్రం చేసేందుకు వాడిన సెలైన్ బాటిల్‌లో బ్యాక్టీరియా వల్లే కంటి చూపు పోయిందని వైద్యఆరోగ్యశాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. సెలైన్ బాటిళ్లను సరఫరా చేసిన కంపెనీని బ్లాక్‌లిస్టులో పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆ కంపెనీ సరఫరా చేసిన సెలైన్ బాటిళ్లు ఇంకా ఎక్కడెక్కడికి సరఫరా అయ్యాయో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
 
 ఎలా జరిగింది..?
 చూపు మందగించడంతో బాధితులు జూన్ 28న సరోజినీదేవి కంటి ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు వారిని పరీక్షించి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని సూచించారు. 30న రెండు ఆపరేషన్ థియేటర్లలో మొత్తం 21 మందికి ఆపరేషన్ చేశారు. మొదటి ఆపరేషన్ థియేటర్‌లో తొమ్మిది మందికి, రెండో ఆపరేషన్ థియేటర్‌లో 12 మందికి సర్జరీ చేశారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ కవిత, డాక్టర్ కిషోర్‌ల వైద్య బృందం రెండో థియేటర్‌లో సత్యనారాయణ(60), పీసీ మండల్(67), అంజిరెడ్డి(70), నూకాలమ్మతల్లి(60), మాణిక్యం(75), ప్రభావతి(65), అర్పిణిబాయి(65), కృష్ణయ్య(60), సరళారాణి(76), బీములు(60) నాగలక్ష్మి(65), దోబ్రూ(60)లకు క్యాటరాక్ట్ సర్జరీ చేశారు.
 
 ఆపరేషన్ చేసిన రెండ్రోజుల తర్వాత బాధితుల కంటికి తీవ్ర ఇన్‌ఫెక్షన్ సోకింది. కన్నువాచిపోయి భరించలేని నొప్పితోపాటు కంటి నుంచి రక్తం కారింది. దీంతో వైద్యులు వారిని మరోసారి పరీక్షించారు. వైద్యపరమైన నిర్లక్ష్యం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆపరేషన్ గదుల్లోని పరికరాలను, వాడిన మందులను పరిశీలించారు. రెండో ఆపరేషన్ గదిలో కంటిని శుభ్రం చేసేందుకు వాడిన సెలైన్ బాటిల్‌ను పరీక్షించగా అందులో ‘క్లెప్సెల్లా’ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది.
ఇదే విషయాన్ని వైద్యులు వివరిస్తూ వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) రమణికి బుధవారం లేఖ రాయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. బాధితుల్లో సత్యనారాయణ, పీసీ మండల్, అంజిరెడ్డి, నూకాలమ్మతల్లి ఎడమ కన్ను, మాణిక్యం, ప్రభావతి, అర్పిణిబాయిల కుడి కన్ను చూపును కోల్పోయారు. వీరిలో ప్రస్తుతం ఇద్దరికి కార్నియా మార్పిడి(ఆప్టికల్ కెరిటోప్లాస్ట్) చేసి చూపును ప్రసాదించే అవకాశం ఉందంటున్నారు. మిగిలిన ఐదుగురు మాత్రం శాశ్వతంగా చూపుకు దూరం కానున్నారు. ఇదే ఆపరేషన్ గదిలో సర్జరీ చేయించుకున్న మిగతా ఐదుగురికి కూడా ఇన్‌ఫెక్షన్ సోకినా వారికి కంటిచూపు పోలేదని వైద్యులు చెబుతున్నారు. మొదటి ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ చేయించుకున్న తొమ్మిది మంది కంటి చూపు బాగానే ఉంది. ఈ ఇన్‌ఫెక్షన్ల కేసులు వెలుగుచూడడంతో జూలై ఒకటో తేదీ నుంచి ఆస్పత్రిలో క్యాటారాక్ట్ సర్జరీలు నిలిపివేశారు.
 
 పూర్తిస్థాయి విచారణకు కమిటీ
 ఎంతో పేరున్న సరోజినీదేవి ఆసుపత్రిలో ఈ ఘటన జరగడంతో వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. బాధితులకు నష్టపరిహారం అందించాల్సిందిగా డీఎంఈ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ మనోహర్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, డ్రగ్ కంట్రోల్ విభాగానికి చెందిన వెంకటేశ్వర్లతో ఉన్నతస్థాయి కమిటీని నియమించారు.
 
 డ్రగ్ కంట్రోల్ విభాగాన్ని కూడా విచారణ చేయాల్సిందిగా కోరారు. ఈ బాటిళ్లను కంపెనీ నుంచి కొని ఆసుపత్రులకు సరఫరా చేసిన తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) పాత్రపైనా సర్కారు విచారణ చేస్తోంది. ఇక సెలైన్ బాటిళ్లలో బ్యాక్టీరియా ఉందని డీఎంఈ ప్రభుత్వానికి నివేదించగా.. అందులో ఎలాంటి బ్యాక్టీరియా లేదని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ వేణుగోపాల్ మరో నివేదిక ఇచ్చారు.
 
 ఎక్కడివి ఆ బాటిళ్లు.. ఎన్ని కొన్నారు?
 రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నింటికీ మందులు, వైద్య పరికరాలను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీనే సరఫరా చేస్తుంది. టెండర్లు పిలిచి వివిధ కంపెనీల నుంచి మందులు, పరికరాలను కొనుగోలు చేస్తుంది. గతేడాది కాంపౌండ్ సోడియం లాక్టేట్ ఇంజెక్షన్ ఐపీ 500 ఎంఎల్/బీఎఫ్‌ఎస్/ఎఫ్‌ఎఫ్‌ఎస్ (సెలైన్) సరఫరా చేసే బాధ్యతను నాగ్‌పూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాసూటికల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. ఈ సెలైన్‌ను రింగర్ లాక్టేట్ అని కూడా పిలుస్తారు.
 
 ఈ సెలైన్ బాటిళ్లను సరఫరా చేయాల్సిందిగా టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ గతేడాది డిసెంబర్ 31న ఆ కంపెనీకి ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 2న వివిధ బ్యాచ్‌లకు చెందిన 7.95 లక్షల సెలైన్ బాటిళ్లు రాష్ట్రానికి వచ్చాయి. అందులో మూడు బ్యాచ్‌లకు చెందిన 1,200 సెలైన్ బాటిళ్లు సరోజినీదేవి ఆసుపత్రికి అందజేశారు. వాటిల్లో 16,385 బ్యాచ్‌కు చెందినవి 816 బాటిళ్లు, 16,386 బ్యాచ్‌వి 144 బాటిళ్లు, 16,387 బ్యాచ్‌కు చెందిన 240 బాటిళ్లు ఆసుపత్రికి అందాయి. రెండో థియేటర్‌లో ఉపయోగించిన ఏడు బాటిళ్లలోని సెలైన్ నమూనాలను పరీక్షకు పంపించారు. వీటిలో రెండింటిలో బ్యాక్టీరియా ఉందని గుర్తించారు. ఆసుపత్రికి వచ్చిన 1,200 బాటిళ్లలో ఇప్పటివరకు 624 బాటిళ్లను ఉపయోగించారని తేలింది. ఇంకా 576 బాటిళ్లు ఆసుపత్రిలోనే ఉన్నాయి. వాటిని సీజ్ చేశారు. 624 బాటిళ్లను పలువురికి ఉపయోగించినందున వారి పరిస్థితి ఎలా ఉందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 ఆ కంపెనీ నుంచి వచ్చినవి 13.07 లక్షల బాటిళ్లు
 నాగ్‌పూర్‌కు చెందిన కంపెనీ నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు రెండు విడతలుగా 13.07 లక్షల సెలైన్ బాటిళ్లను సరఫరా చేసింది. మొదటి విడత 7.95 లక్షల బాటిళ్లు, రెండో విడత 5.11 లక్షల బాటిళ్లు సరఫరా చేసింది. మొత్తం 128 బ్యాచ్‌లుగా అవి రాష్ట్రానికి చేరాయి. అయితే వాటిని రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాలకు తరలించారు? వాటిలో ఎన్ని వాడారన్న సమాచారం తెలియాల్సి ఉంది. సదరు కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టినందున ఆసుపత్రులకు చేరిన లక్షలాది సెలైన్ బాటిళ్లను ప్రభుత్వం సీజ్ చేయాలని నిర్ణయించింది. వాటిని వాడొద్దని ఆదేశాలిచ్చినట్లు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ వేణుగోపాల్ తెలిపారు.
 
 పోలీస్‌స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు
 తమ కంటిచూపు పోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. జూనియర్ వైద్యులతో శస్త్రచికిత్స చేయిం చినట్లు వెల్లడించారు. ఇందుకు కారణమైన బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుల బంధువులు హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైద్యులపై ఐపీసీ 338 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు సరోజినీదేవి ఆస్పత్రికి వెళ్లి సెలైన్ బాటిళ్లు, వాటిని నిల్వ చేసిన తీరు, ఎక్స్‌పైరీ డేట్ వంటి అంశాలపై ఆరా తీశారు.
 
 ఆ కాస్తా చూపు పోగొట్టారు
 వైద్య పరీక్షలు చేయించుకొని అవసరమైతే కంటి అద్దాలు పెట్టుకుందామని ఇక్కడికి వచ్చాను. రెండు, మూడు సార్లు ఆపరేషన్ చేశారు. కట్లు విప్పాక ఏమీ కన్పించలేదు. వైద్యులు నాకు సర్జరీ చేసి ఉన్న ఆ కొద్దిపాటి చూపు కూడా పోగొట్టారు.
 - ప్రభావతి, జీడిమెట్ల, హైదరాబాద్
 
 బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతాం: లక్ష్మారెడ్డి
 వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సాయంత్రం సరోజినీదేవి ఆస్పత్రిని సందర్శించారు. ఆపరేషన్లు వికటించడంపై ఆరా తీశారు. ‘‘సెలైన్ బాటిళ్లను సరఫరా చేసిన కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాం. ఘటనకు బాధ్యులైన వారిపై, సంస్థలపై క్రిమినల్ కేసులు పెడతాం. మొత్తం 13 మందికి ఆపరేషన్ చేయగా.. వారిలో ఆరుగురు మంచి చూపుతో ఇంటికెళ్లారు. ఐదుగురికే ఒక కన్ను మాత్రమే పోయింది. మరో ఇద్దరు ఇంటి నుంచి ఆసుపత్రికి వస్తున్నారు. ఒక కన్ను పోయిన ఐదుగురికి కూడా పూర్తిగా ఒక కన్ను పోయిందని చెప్పలేం. వారికి ప్రభుత్వ పరంగా బయటి డాక్టర్లను తెప్పించి లేదా వేరేచోట వైద్యం చేయిస్తాం. రెండో థియేటర్లోని సెలైన్‌లో బ్యాక్టీరియా ఉందని తేలింది. మరో థియేటర్లో ఎలాంటి బ్యాక్టీరియా బయటపడలేదు. వాడిన ఏడు బాటిళ్లను పరీక్షలకు పంపగా... రెండింటిలో బ్యాక్టీరియా బయటపడింది’’ అని చెప్పారు.
 
 నగరంలో 30 ఆసుపత్రులకు 30 వేల బాటిళ్లు..
 హైదరాబాద్‌లో మొత్తం 30 ఆసుపత్రులకు ఇలాంటివే 30,840 సెలైన్ బాటిళ్లను సరఫరా చేశారు. ఈ బ్యాచ్‌లకు చెందిన బాటిళ్లలోనే బ్యాక్టీరియా బయటపడింది. వాటిల్లో ఇప్పటివరకు ఎన్నింటిని వాడారన్నది తేలా ల్సి ఉంది. నగరంలో బార్కాస్ సామాజిక ఆరోగ్య కేంద్రం, కోఠి ఈఎన్‌టీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, గోల్కొండ ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ సాధారణ చెస్ట్ ఆసుపత్రి, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి, కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రి, అంబర్‌పేట, లాలాపేట, పానీపుర, సీతాఫల్‌మండి, అడ్డగుట్ట, బైబిల్ హౌస్, బోరబండ, డీఆర్ పాల్ దాస్, గడ్డి అన్నారం, గరీబ్‌నగర్, కిషన్‌బాగ్, తార్నాక, పాన్ బజార్, పురాన్‌పూల్-1, ఆర్‌ఎఫ్‌పీటీసీ, తుకారాంగేట్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, మలక్‌పేట, మల్లేపల్లి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రుల్లో, నయాపూల్, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ ఆసుపత్రుల్లో, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, శాలిబండ మున్సిపల్ సామాజిక ఆసుపత్రిలో ఈ బాటిళ్లను సరఫరా చేశారు.
 
 కన్ను తెరిచి చూస్తే ఏమీ కన్పించలేదు
 కంటిచూపు మందగించడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చా. ఆపరేషన్ తర్వాత కళ్లు తెరిచి చూస్తే ఏమీ కనపడ లేదు. కంటి చూపు పూర్తిగా పోయింది. పెద్ద ఆసుపత్రని వస్తే నన్ను గుడ్డిదాన్ని చేశారు.
 - నూకాలమ్మతల్లి,
 నర్సీపట్నం, విశాఖపట్నం.

 
 రెండుసార్లు ఆపరేషన్ చేశారు
 అక్షరాలు సరిగా కన్పించక పోవడంతో వైద్యుడికి చూపించుకుందామని వచ్చా. ఆపరేషన్ చేశారు. రెండ్రోజుల తర్వాత మళ్ల్లీ రమ్మాన్నారు. చెకప్‌కు వెళ్తే మరోసారి ఆపరేషన్ చేశారు.
 - అర్పిణిబాయి, గోల్కొండ , హైదరాబాద్
 
 ఇంత దూరం వచ్చి  తప్పు చేశా..
 మా ఊళ్లో డాక్టర్లు చెబితే ఇక్కడికి వచ్చాను. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటే సరే అన్నాను. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని గుడ్డివాణ్ణి అయ్యాను.
 - మాణిక్యం,
 కుకునూరు, మెదక్
 
 ఇలా అవుతుందని అనుకోలేదు
 డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఉన్న కంటిచూపు పోయింది. ఈ వయసులో గుడ్డివాడిగా ఎలా జీవిం చాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి.
 - అంజిరెడ్డి, పలుగుట్ట, చేవేళ్ల  
 
 కళ్లు తెరిస్తే అంతా చీకటే
 నా కూతురు సలహా మేరకు కంటి పరీక్షల కోసం ఇక్కడికి వచ్చాను. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. వారం తర్వాత కళ్లు తెరిస్తే అంతా చీకటే. ఉన్న చూపు పోయింది.
 - పి.సి.మండల్, కోల్‌కతా
 
 ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే..
 వైద్యుల నిర్లక్ష్యం వల్లే నా కంటిచూపు పోయింది. నాకు డాక్టర్లు రెండుసార్లు ఆపరేషన్ చేశారు. చివరికి నన్ను ఇలా గుడ్డివాణ్ణిలా తయారు చేశారు.
 - సత్యనారాయణ,
 కార్వాన్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement