మాటలతో మాయలు చేస్తుండు
► కేసీఆర్‌పై షబ్బీర్‌అలీ ధ్వజం
బంజారాహిల్స్: కల్లబొల్లి మాటలు చెబుతూ సీఎం కేసీఆర్ ప్రజలను మో సం చేస్తున్నారని శాసనమండలి ప్రతి పక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. బంజారాహిల్స్‌రోడ్ నెం.10లో ఏడాది క్రితం బంజారాభవన్, కొమరం భీమ్ భవన్, బాబు జగ్జీవన్‌రాం భవన్‌లకు ముఖ్యమంత్రి ఆర్భాటంగా శంకుస్థాపన చేశారని, తీరా చూస్తే అది వివాదాస్పద స్థలమని తేలడంతో శిలాఫలకాలు తొలగించారని ఇప్పుడు ఆ భవనాలు ఎక్కడ కడతారని ప్రశ్నించారు. శిలాఫలకాలు వేసిన స్థానంలో సీఎం తీరుకు నిరసనగా ఆదివారం షబ్బీర్‌అలీతో పాటు అంజన్ కుమార్ యాదవ్, మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలంటే కేసీఆర్‌కు చిన్నచూపని దుయ్యబట్టారు. బీసీలకు, ముస్లింలకు, గిరిజనులకు విడుదల చేసిన నిధుల్లో 70 శాతం నిధులు విడుదల కాలేదన్నారు. కమీషన్ల కోసం వాటర్‌గ్రిడ్, మిషన్‌కాకతీయ పనులకు మాత్రం నిధులు విడుదల చేశారని దుయ్యబట్టారు. మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చే జీవోలకు అడ్డూ అదుపు లేకుండాపోతుందని అన్నారు.అంజన్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాలను అవమానపరుస్తున్నారన్నారు. అయుత చండీయాగం ద్వారా కేసీఆర్ బుద్దిమారాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్, నాగేందర్, మాజీ డిప్యూటీ మేయర్‌రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే వారికే నష్టం..
ఎంఐఎం అదినేత అసుద్దీన్ ఓవైసీ మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడటం తగదని, ఏదైనా రాజకీయం చేయాలనుకుంటే మైదానంలోకి రావాలని షబ్బీర్ అలీ దుయ్యబట్టారు. ఆదివారం బంజారాహిల్స్‌రోడ్ నెం. 10లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే వాళ్లు పాముకు పాలు పోసినట్లేనని ఆరోపించారు. కాల్‌మనీలో ఎంఐఎం నేతలు ఎంతో మంది ఉన్నారని పేర్కొన్నారు.