మా పట్ల ఔదార్యం చూపండి
♦ చట్టంలోనివేగాక ఇతరత్రా సాయమూ చేయండి
♦ అసెంబ్లీ సీట్లను 225కు పెంచండి
♦ కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు వినతి
♦ హోదా, ఆర్థికసాయం సహా పదిహేడు అంశాలతో తీర్మానం ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణతో ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పన్నమైన సమస్యల పరి ష్కారానికి కేంద్రం ఉదారత చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలతోపాటు ఇతరత్రా సాయమూ అందించాలని కోరారు. నిర్దిష్ట గడువులోగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం రాష్ట్ర శాసనసభలో 77వ నిబంధన కింద తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతులను అంకెలతోసహా వివరించారు.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించే సందర్భంలో.. 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీల్ని త్వరగా అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్థికసాయం, పోల వరం ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేయడం, పారిశ్రామిక రంగానికి పన్నురాయితీలు, ప్రోత్సాహకాలు, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖలో రైల్వేజోన్, ఆస్తులు, అప్పుల పంపిణీ, స్థానికత, శాసనసభ సీట్లను 175 నుంచి 225కు పెంచడంసహా మొత్తం 17 అంశాలతో ఆయన తీర్మానాన్ని ప్రతిపాదించారు. అనంతరం అందులోని ఒక్కో అంశాన్ని వివరించారు.
తలసరి ఆదాయం తక్కువే..
దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం రూ.35 నుంచి రు.40 వేలు తక్కువగా ఉందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత తలసరి ఆదాయం రూ.95,689గా ఉంటే తెలంగాణలో 1,29,182గా ఉందన్నారు. అయినప్పటికీ 10.99 శాతం వృద్ధిని రాష్ట్రం సాధించిందని వివరించారు. అయితే నిర్మాణాత్మక మార్పులు రాకుండా ఆదాయం పెరిగే అవకాశం లేదన్నారు. వ్యవసాయాదాయం ఎక్కువగా ఉన్నచోట తక్కువ పన్నులు(ట్యాక్స్‌లు) వస్తాయని చెప్పారు. విభజన నాటికి ఆడిటర్ జనరల్ లెక్కప్రకారం రాష్ట్ర ఆర్థిక లోటు రూ.16,079 కోట్లుగా ఉంటే కేంద్రం నుంచి ఇప్పటివరకు కేవలం 2,303 కోట్లే వచ్చాయని, ఇంకా రూ.13,776 కోట్లు రావాల్సి ఉందన్నారు. 14వ ఆర్థిక సంఘ నివేదిక ప్రకారం.. 2019 వరకు కూడా రాష్ట్రం ఆర్థిక లోటు నుంచి తేరుకునే పరిస్థితి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర నిధులు వ్యయం చేసినా కేంద్రం నుంచి తిరిగి రాబడతామని చెప్పారు. ఉత్తరాఖండ్, బుందేల్‌ఖండ్, హిమాచల్‌కు ఇచ్చిన ప్యాకేజీలు తమకూ ఇవ్వాలని కోరారు.
అసెంబ్లీ సీట్ల పెంపు పెద్ద కష్టం కాదు...
అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు పెంచడం పెద్ద కష్టం కాదని చంద్రబాబు అన్నారు. బిల్లులో పెట్టాలని కోరామని, పెంచుతామని కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు. డీలిమిటేషన్‌కు, అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధం లేదన్నారు. సీట్ల పెంపువల్ల ఎటువంటి ఆర్థిక భారమూ ఉండబోదన్నారు. పార్లమెంటు సీట్లకు, దీనికి సంబంధం ఉండదన్నారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపడం ద్వారా సీట్లు పెరుగుతాయన్నారు.
కేంద్రం జోక్యం చేసుకోవాలి
షెడ్యూల్ 9, 10లోని సంస్థల ఏర్పాటుకు ఎంత వ్యయమవుతుందో అంత డబ్బు ఇమ్మని కోరినట్టు ఆయన తెలిపారు. ఆస్తులు-అప్పుల పంపిణీపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కలసి కూర్చుని ఏడాదిలోగా పరి ష్కరించుకోవాల్సి ఉన్నా.. అది జరగనందున కేంద్రప్రభుత్వమే జోక్యం చేసుకోవాలన్నారు. ఎవరికీ అన్యాయం జరక్కుండా పంపిణీ చేయాలని కోరారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందేవరకూ ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశా రు. రాష్ట్రాభివృద్ధికి, మెరుగైన ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు అందరూ కలసి రావాలన్నారు. తాను ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవం గా ఆమోదించాలని సభకు విజ్ఞప్తి చేశారు.