
మోదీ నేతృత్వంలో చతుర్ముఖ ప్రభుత్వం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో చతుర్ముఖ ప్రభుత్వం సాగుతోందని సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
* అమెరికా అనుకూల విధానాలు.. మతోన్మాద ధోరణులతో నష్టం
* సీపీఎం రాష్ట్ర నిర్మాణ ప్లీనంలో సీతారాం ఏచూరి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో చ తుర్ముఖ ప్రభుత్వం సాగుతోందని సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా సామ్రాజ్యవాద అనుకూల ఆర్థిక, విదేశాంగ విధానాలతో పాటు మతోన్మాద, నిరంకుశ-ఆధిపత్య ధోరణులతో కూడిన నాలుగు ముఖాల పాలన ప్రస్తుతం కొనసాగుతోందన్నారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద మోదీ సుదీర్ఘ ప్రసంగంలో దేశంలో నేటి పరిస్థితులు, సమస్యలు.. వాటి పరిష్కారం గురించి ఒక్క ముక్క కూడా ప్రస్తావించలేదన్నారు.
మంగళవారం సుందరయ్య కళానిలయం వద్ద మూడురోజుల సీపీఎం రాష్ట్ర నిర్మాణ ప్లీనం సమావేశాల ప్రారంభం సందర్భంగా సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. అమలవీరుల స్థూపం వద్ద ఏచూరితో పాటు పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. సంతాప తీర్మానాన్ని రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యురాలు టి.జ్యోతి ప్రతిపాదించారు.
ఆ ప్రసంగం వాస్తవానికి భిన్నం...
సమావేశంలో ఏచూరి మాట్లాడుతూ... ‘ఎర్రకోటపై ప్రసంగంలో మోదీ... రిఫార్మ్, ఫెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ (ఆర్‌పీటీ) అంటూ కొత్త నినాదం అందుకున్నారు. ఇంగ్లిషులో ఆర్‌పీటీ అంటే రిపీట్ అని అర్థం. రెండేళ్లుగా మోదీ అదే పని చేస్తున్నారు. ప్రజలపై ఆర్థిక భారం పెద్దఎత్తున పెరగబోతుండగా, వాస్తవ పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఆయన ప్రసంగం ఉంది. కశ్మీర్ భారత్ అంతర్గత అంశమన్న మోదీ.. పాక్ అంతర్భాగమైన బెలూచిస్తాన్ పై ప్రస్తావించి మన సమస్యలో ఇతర దేశాలు జోక్యం చేసుకొనే అవకాశమిచ్చారు. దేశంలో మతోన్మాద ఘర్షణలతో సామాజిక ఐక్యతను దెబ్బతీసి మత విభజన తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అన్నారు.
అభివృద్ధి ఎక్కడ?
బీజేపీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న అభివృద్ధి జాడ ఎక్కడని ఆయన ప్రశ్నించారు. దేశ ఆర్థికపరిస్థితి ఆందోళనకరంగా ఉందని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ రఘురామరాజన్ మాటలను బట్టి స్పష్టమైందన్నారు. వ్యవసాయ సంక్షోభం తీవ్రమై రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలను తీవ్రం చేయడం ద్వారానే కేంద్రంపై ఒత్తిడిని తీసుకురాగలమన్నారు. ఇందుకోసం లెఫ్ట్,ప్రజాతంత్ర, అభ్యుదయ, సామాజిక శక్తులను కూడగట్టి ఐక్యంగా ముందుకు సాగాలని ఏచూరి పిలుపునిచ్చారు.
నయీమ్ అక్రమాలపై విచారణ చేయాలి
నయీమ్ ఆగడాలు, అక్రమాలు, వెనుక నుంచి వాటిని ప్రేరేపించిన వారిని బయట పెట్టేందుకు సిట్ చాలదని, న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని సీపీఎం ప్లీనం ఆమోదించింది. పోలీసులు, ప్రభుత్వ సహకారం లేకుండా నయీమ్ ఇన్ని దుర్మార్గాలు చేయగలిగేవాడు కాదని పార్టీ నేత జూలకంటి అన్నారు. అతను ఆక్రమించిన ఆస్తులను సొంతదారులకు అప్పగించాలన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ తీర్మానాన్ని ప్లీనం ఆమోదించింది. ప్రజా సమస్యల పరిష్కారానికి, సామాజిక న్యాయసాధనకు వామపక్ష, ప్రజాస్వామిక, సామాజిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దిశగా వామపక్షాలు ఐక్యంగా చొరవ చూపాలి’’ అని పిలుపునిచ్చింది.
అన్ని శక్తులూ ఏకం కావాలి
టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన ఆశించినట్టు లేదని, భవిష్యత్ కూడా ఆశాజనకంగా కనబడడం లేదని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి గత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వామపక్ష, ప్రజాతంత్ర, జస్టిస్ చంద్రకుమార్, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, సామాజిక శక్తులు కలసి కొత్త ఆలోచనలతో మార్పునకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం సీపీఎం రాష్ట్ర నిర్మాణ ప్లీనంలో ఆయన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘గతంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపింది. నేడు టీఆర్‌ఎస్ హయాంలో కదిలితే కాల్పులు, మెదిలితే లాఠీచార్జీ చేస్తున్నారు’ అన్నారు.