
నెట్ జూదం... తీసింది ప్రాణం
నెట్లో జూదానికి అలవాటుపడి ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ : నెట్లో జూదానికి అలవాటుపడి ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాలనగర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ప్రకారం... కడప నెహ్రు నగర్కు చెందిన మనోజ్ (28), శ్రీలక్ష్మి దంపతులు బాలనగర్ కల్యాణ్ నగర్లో అద్దెకుంటున్నారు. శ్రీలక్ష్మి ప్రసవం కోసం పది నెలల క్రితం స్వగ్రామానికి వెళ్లింది. పంజాగుట్టలోని ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్గా పని చేస్తున్న మనోజ్ విధులకు వెళ్లడం మానేశాడు. ఇంట్లోనే ఉంటూ నెట్లో జూదం ఆడటం మొదలు పెట్టాడు.
దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఇదిలా ఉండగా, ఓ పెళ్లికి హాజరయ్యేందుకు ఊరెళ్లిన ఇంటి యజమాని సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆదివారం తిరిగి వచ్చేసరికి దుర్వాసన వస్తోంది. వెంటనే వారు పై అంతస్తులోకి వెళ్లి చూడగా మనోజ్ తన ఇంట్లో స్లాబ్ హుక్కుకు ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. దీనిని బట్టి మూడు రోజుల క్రితమే అతను చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇంట్లోనే ఒంటరిగా ఉండటంతో జీవితంపై విరక్తి చెందిన మనోజ్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు.