పారిశ్రామిక విప్లవంతో ప్రపంచ స్వరూపం సమూలంగా మారిపోయింది. అప్పటిదాకా మానవ శ్రమపై ఆధారపడి సాగిన ఉత్పత్తి, రవాణా, ఇతర సేవా కార్యకలాపాలను యంత్రాలు నిర్వహించడం మొదలైంది. ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరిగింది. పాత ఉద్యోగాలు పోయాయి. యంత్రాలపై పనిచేసే నైపుణ్యం అవసరమైన కొలువులు పెరిగాయి. అలాంటి అనూహ్యమైన పరిణామం మరొకటి ఇప్పుడు రాబోతోంది. అదే కృత్రిమ మేధ! అది తెచ్చే మార్పులకు మనమంతా సన్నద్ధం కావాల్సిందే.
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ పవనాలు వేగంగా వీస్తున్నాయి. ఇకపై మనిషి చేసే ప్రతి పనినీ చక్కబెట్టేందుకు కంప్యూటర్లు సిద్ధమవుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల తీరుతెన్నులు, సమాజ గమనం, ప్రజల జీవన విధానాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోక తప్పదు. ఇప్పటిదాకా మనం చూస్తున్న, చేస్తున్న ఉద్యోగాల్లో చాలా వరకు వచ్చే కొన్నేళ్లలో కనుమరుగవుతాయి. ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సవాలు విసిరేలా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. వారికి లక్షల్లో జీతాలు చెల్లించాలంటే కంపెనీలకు భారంగా మారుతుంది.
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కొన్ని రకాల ఉద్యోగాలను కోల్పోవలసి రావచ్చని సర్వేలు చెబుతున్నాయి. మెకిన్సే సంస్థ నివేదిక ప్రకారం నూతన సాంకేతిక మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 40-80 కోట్ల ఉద్యోగాలకు ముప్పు కనిపిస్తోంది. దాదాపు 35 కోట్ల మంది కొత్త ఉద్యోగాల్లోకి మారాల్సి వస్తుంది. సంప్రదాయ ఉద్యోగాల్లోనే కొనసాగుదామనుకొన్నా సాధ్యం కాదు. అటువంటి పనులన్నీ కంప్యూటర్లు, వాటికి అనుసంధానమయ్యే యంత్రాలు పూర్తిచేస్తాయి. అయితే, యంత్రాలను నియంత్రించడం, వాటికి పనుల్ని నిర్దేశించడం, స్టాఫ్ట్‌వేర్లు అయితే ఏఐకి సూచనలు ఇవ్వడం వంటివి మనుషులే చేయాలి. ఇలాంటి కొత్త తరహా విధులకు సంబంధించి సరికొత్త ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో లభిస్తాయి. కోల్పోయిన ఉద్యోగాలకంటే పెద్దసంఖ్యలో లభ్యమవుతాయి.
ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్..
కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయని 1990 దశకంలో అందరూ భయపడిపోయారు. తదనంతర కాలంలో కోల్పోయిన ఉద్యోగాలకంటే అధికంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. కాకపోతే, నూతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా శక్తిసామర్థ్యాలను, నైపుణ్యాలను నేర్చుకోవాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment