
డిప్రెషన్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ :
జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సిఐ కుషాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన కోమలికి భాస్కరరావుతో అయిదు సంవత్సరాల క్రిందట వివాహం జరిగింది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి కేపీహెచ్‌బీ కాలనీ మూడవ ఫేజ్, ఎంఐజి 515 లో నివాసముంటున్నారు.
కోమలి (30) సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తుండగా, భాస్కరరావు కూడా ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే బుధవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భాస్కరరావు తలుపులు తెరిచేందుకు యత్నించగా లోపలనుంచి గడియపెట్టి ఉండటంతో పాటు ఎంతకీ తలుపులు తెరవకపోవటంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా కోమలి చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు.
తలుపులు తెరిచి లోనికి వెళ్లి చూడగా బెడ్ రూమ్‌లో సూసైడ్ నోట్ లభించినట్లు సిఐ కుషాల్కర్ తెలిపారు. సూసైడ్ నోట్‌లో తన చావుకు ఎవరూ కారణం కాదని తానే డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వ్రాసి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.