కోటి వెలుగుల ఉగాది
సిటీ జీవి ఫన్‌చాంగమ్
కొత్త ఆశలు.. కొంగొత్త ఆశయాలు... వసంత కోకిల సాక్షిగా మారాకు తొడుగుతున్న సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టే పర్వదినం..ఉగాది. షడ్రుచులకు ప్రతిరూపం ఈ పండగ. కానీ పండగ రోజున హైదరాబాదీకి సంతోషం ఆవిరవుతోంది. ధరాఘాతంతో ఉగాది ఉషస్సులు మాయమవుతున్నాయి. ఉప్పు, పప్పు, ఇంధనం, నిత్యవసరాల ధరలు కొండెక్కి... సామాన్యునికి సంబరాన్ని దూరం చేస్తున్నాయి. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కితే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామా? అన్న ఆందోళన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సవాలక్ష సమస్యలు.. సవాళ్ల మధ్య సగటుజీవి ఉగాది సంబరాలు ఎలా జరుపుకుంటున్నాడో.. చూద్దాం... -సాక్షి, సిటీబ్యూరో
ధరల ‘కారం’
‘దిగిరాము దిగిరాము దివి నుంచి భువికి’ అన్న రీతిలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశంలో ఉంటున్నాయి. బియ్యం, పప్పుల ధరలు పెరుగుతున్నాయి.ఇవి నగరజీవి నోటికి ‘కారం’ ఘాటులా మారాయి. వ్యాపారులు, వారిని నియంత్రించాల్సిన పాలకులు మాత్రం ‘నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు?’ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. బెండకాయ మొదలుకొని బీన్స్ వరకు ఏ కూరగాయల ధరలు చూసినా సగటు జీవి బెంబేలెత్తిపోవాల్సిందే. మామిడి కాయ మొదలు నూనెలు, ఉప్పు, పప్పులు, చింతపండు, మసాలా దినుసులు, కూరల ధరలు ‘గాయాలు’ చేస్తున్నాయి. గ్యాస్‌బండ గుదిబండగా మారుతోంది. పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలతో వేతనజీవులు కుదేలవుతున్నారు. వెరసి నగరవాసి జీవనం నానాటికి భారమవుతోంది.
ఉపాధి ‘తీపి’
ఐటీ ఎగుమతుల్లో గ్రేటర్ నగరం జాతీయ స్థాయి సగటు కంటే మూడు శాతం అధిక వృద్ధిని సాధించడం.. నయా ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు నగరానికి వెల్లువెత్తడం సిటీజనులకు తీపికబురు. గత ఏడాదిగా ఈ రంగంలో సుమారు 80 వేల కొత్త కొలువులు రావడం ఊరటనిస్తోంది. ప్రస్తుతం నగరం కేంద్రంగా 538 ఐటీ, హార్డ్‌వేర్ కంపెనీలు పని చేస్తున్నాయి. అమేజాన్, ఊబర్, గూగుల్ వంటి సంస్థలు నగరానికి క్యూ కడుతుండడం కుర్రకారును హుషారెత్తిస్తోంది.
వసతుల ‘ఉప్పు’
మండుటెండలకు గ్రేటర్ శివార్ల గొంతెండుతోంది. పెరుగుతున్న జనాభా దాహార్తి తీర్చడంలో జలమండలి విఫలమవుతోంది. మంచినీటి సరఫరా వ్యవస్థ లేకపోవడంతో శివార్లలో నిత్యం 35 లక్షల మందికి అవస్థలు తప్పడం లేదు.రహదారులపైపొంగి పొర్లుతున్న డ్రైనేజీ లైన్లు పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. చాలీచాలని రహదారులు, మురికివాడల సమస్యలు, అస్తవ్యస్థమైన ప్రజా రవాణా, సర్కారు వైద్యం దైన్యంగా మారుతున్న దుస్థితి.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్న ప్రభుత్వం.. వెరసి గ్రేటర్ వాసికి కష్టాల సహవాసం తప్పడం లేదు.
ట్రాఫిక్.. ‘పులుపు’
మహా నగరంలో ప్రస్తుతం వాహనాల సంఖ్య 45 లక్షలు. వీటికి తోడు నిత్యం సుమారు 600 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయి సగటు వేగం గంటకు 12 కి.మీ.కు పడిపోతోంది. రోడ్డెక్కిన ప్రతి ఒక్కరూ నరకాన్ని చవిచూడాల్సి వస్తోంది. నగరానికి ‘మణిహారం’లా చుట్టూ విస్తరిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డుపై వరుస ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి.
ఫీజుల..‘వగరు’
ఏటా పెరుగుతున్న పిల్లల స్కూలు ఫీజులు తల్లిదండ్రులకు మింగుడు పడడం లేదు. వీధుల్లోని ప్రైవేటు బడులుమొదలు కార్పొరేట్ పాఠశాలల వరకు ఈ ఏడాది ఫీజుల్లో సుమారు 10 నుంచి 20 శాతం పెరగడంతో వేతన జీవులు కుదేలవుతున్నారు. వీటికి తోడు పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారాలు, షూస్, ట్రాన్స్‌పోర్ట్ వంటి అదనపు ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో మధ్య తరగతి వర్గం ఆందోళన చెందుతోంది.
ఎండలు..‘చేదు’
ఆరేళ్ల తరువాత గ్రేటర్‌లో ఏప్రిల్ తొలి వారంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు.. వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హరితం హరించుకుపోవడంతో సేదదీరేందుకు అవకాశం లేకుండా పోయింది. ఒకప్పుడు తోటల (భాగ్) నగరంగా ప్రసిద్ధి చెందిన మహానగరం ఇప్పుడు కాంక్రీట్ మహారణ్యంలా మారడంతో వేసవితాపం పెరుగుతోంది.