స్టూడెంట్ స్టార్స్
నవ్యత్వానికి.. ఉరకలెత్తే ఉత్సాహానికీ ప్రతీకలు.. యువకులు, విద్యార్థులు. ప్రోత్సహిస్తే చాలు.. ఎవరెస్టునైనా అవలీలగా ఎక్కేయగలరు. వారికి కావాల్సింది కాస్తంత ప్రోత్సాహం. ఇది కరువయ్యే చాలామంది లక్ష్యం నుంచి చివరి క్షణంలో తప్పుకుంటున్నారు. వెన్నుతట్టే వారు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. అటువంటి వారి కోసం నేనున్నానంటోంది ‘స్మార్ట్ స్కిల్స్ ల్యాబ్’.
..:: కోన సుధాకర్‌రెడ్డి
కష్టపడి చదువుతారు. పరీక్ష లేదా ఇంటర్వ్యూ వరకు వెళ్లేసరికి నీరుగారిపోతారు. నటనతో ధూమ్‌ధామ్ చేయాలనుకుంటారు. స్టేజ్ ఎక్కగానే నీరసపడిపోతారు. అద్భుతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆరంభశూరులుగానే మిగిలిపోతారు. ఇంగ్లిష్‌లో అదరగొట్టాలనుకుంటారు. మాట్లాడాలనుకునే సరికి నోట్లోంచి మాటలు పెగలవు. ఇటువంటి యువత వెన్నుతడుతూ ముందడుగు వేయిస్తోంది స్మార్ట్ స్కిల్స్ ల్యాబ్. ‘విజయంలో శభాష్ అనాలి.. ఓటమిలో వెన్ను తట్టాలి’ అంటున్న ఈ సంస్థ ప్రోత్సాహంతో ఇటీవల 12 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ‘రాక్‌స్టార్’ పేరుతో ఏకకాలంలో 37 కళారూపాల ప్రదర్శనలతో అదరగొట్టారు.
భయం.. ఆందోళన..
ఈ రెండే నేడు విద్యార్థులకు, యువతకు శత్రువులు. అటువంటి వారిలో స్థైర్యాన్ని నింపుతోంది స్మార్ట్ స్కిల్స్ ల్యాబ్. సిటీలోని యువత, విద్యార్థుల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్టేజ్ ఫియర్ పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది. ‘భయాన్ని తొలగిస్తే, ఎవరికి వారే ముందుకు నడుస్తారు’ అంటారు స్మార్ట్ స్కిల్స్ ల్యాబ్స్ కో- ఫౌండర్, సీఈవో డేనియల్‌రాజ్. విద్యార్థుల్లో నెలకొన్న భయం, ఆందోళన అనే భావనలే వారి ఓటమికి కారణమవుతున్నాయని గుర్తించాం. అదే సంస్థగా రూపాంతరం చెందిందని అంటారాయన.
చదువుతూ పాడుతున్నాం..
మాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం హాబీ. అయితే దీన్ని వెలుగులోకి తెచ్చుకునే ధైర్యం చేయలేకపోయాం. ఇప్పుడు స్టేజ్ ఎక్కిన అనుభవం భయాన్ని పోగొట్టింది. కొన్ని ఆల్బమ్స్ చేశాం. భవిష్యత్తులో సినిమాల్లో పాడాలని తపన. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రియేటివిటీ వెలుగు చూసేందుకు ఒక ప్లాట్‌ఫాం అవసరం’ అంటారు డిగ్రీ మొదటి సంవత్సరం భవన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు గాయత్రి, తేజస్విని, భానువర్ష. ఇలాంటి ఎంకరైజ్డ్ ప్లాట్‌ఫాంలు మరిన్ని సిటీలో రావాలి అంటున్నారు వీరు.
ప్రోత్సాహమిస్తే అందరూ స్టార్సే..
శ్రీనిధి కాలేజ్‌లో బీఈ సెకండియర్ చదువుతున్న జి.అరుణ్‌కు తెలంగాణ జానపద గీతాలంటే చాలా ఇష్టం. కానీ, స్టేజ్ షో ఇవ్వాలంటే బెరుకు. కానీ, తొలి ప్రదర్శనలో అతను అదరగొట్టాడు. ‘చాలామంది యువత ఇంటర్వ్యూ దాకా వెళ్లి వెనుతిరుగుతున్నారు. స్కిల్స్ లేవా అంటే ఉంటాయి. కానీ భయమే కారణం. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్, మిమిక్రీ వంటి వాటిలో చదువుకునే సమయంలో ప్రతిభ కలిగి ఉంటారు. కానీ, భయం వల్ల ప్రదర్శించలేరు. అటువంటి వారి కోసమే ‘రాక్‌స్టార్-2014’ ప్లాట్‌ఫాం కావాలని భావించి.. అందరినీ ఒక వేదికపైకి తెచ్చాం. తొలి ప్రదర్శన ఇంత విజయవంతం అవుతుందని ఊహించలేదు’ అని అంటారు డేనియల్ రాజ్.
ఉత్సాహమొచ్చింది..
సాయికుమార్ రూబిక్స్ క్యూబ్స్‌లో ఆరు కలర్స్‌ను 14 సెకన్లలో ఒకచోటికి తేగలడు. అదే పనిని కళ్లకు గంతలు కట్టుకొని నాలుగు నిమిషాల్లో చేస్తాడు. భవన్స్ డిగ్రీ కాలేజ్‌లో థర్డియర్ స్టూడెంట్ అయిన ఇతనిలో ఇంత ప్రతిభ ఉన్నా ఏనాడూ ప్రదర్శించాలనుకోలేదు.
అందరి ఎదుటా ప్రదర్శిస్తే ఫెయిలవుతానని భయం.. హరిహరకళాభవన్‌లో ‘రాక్‌స్టార్’ కింద ఇతనూ తన ప్రదర్శననిచ్చాడు. చివరకు అతని ఆత్మవిశ్వాసమే అతనిని గెలిపించింది. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న సాయికుమార్.. వర ల్డ్ క్యూబ్ అసోషియేషన్ (లాస్‌ఏంజెల్స్) త్వరలో నిర్వహించే అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనడానికి సన్నద్ధమవుతున్నాడు.