మన మాలి | Gardener of the mind | Sakshi
Sakshi News home page

మన మాలి

Published Tue, Jan 20 2015 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

మన మాలి

మన మాలి

ఇష్టం లేని చదువో.. ఇష్టమైనవాళ్లు దూరమయ్యారన్న బాధో... గుండె నిండా భారం. ఫలితం కాన్సంట్రేట్ కుదరక.. పోటీ ప్రపంచంలో వెనుకబడి ఓటమి పాలవుతున్న విద్యార్థులనేకం. వారికి పరిష్కారం చూపిస్తున్నారు ఎన్‌ఆర్‌ఐ నిత్య కానూరి. యూత్‌కి అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి భావోద్వేగాలను కంట్రోల్ చేసే ప్రత్యేక యాప్‌ను తయారు చేశారు. ఇనుములో హృదయాన్ని సృష్టించి స్టూడెంట్స్ నుంచి టెన్షన్‌ను దూరం చేస్తున్నారు. ఆ మొబైల్ యాప్ ప్రత్యేకతలు, ఆ ప్రాజెక్ట్ వివరాలు నిత్య కానూరి మాటల్లోనే...

‘మన మాలి ప్రాజెక్ట్...
త్రీ ఇడియట్స్ సినిమా చూసినప్పుడు ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, అది విద్యార్థులపై పెంచుతున్న ఒత్తిడి  అర్థమైంది. వారి నుంచి ఆ భారాన్ని దూరం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. టీనేజ్ దశలో మనసులో ఎన్నో ఆందోళనలు. వాటిని పేరెంట్స్‌కి చెప్పలేరు, ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోలేరు. ఫలితంగా మానసిక ఒత్తిడి.

ఆ ఒత్తిడిని దూరం చేయాలనే ఉద్దేశంతో ‘మనమాలి’ (మనసుకు గార్డెనర్) యాప్ రూపొందించాం. స్టాన్‌ఫోర్డ్ మెడికల్ స్కూల్, బిట్స్ పిలానీ, వీన్‌ఆర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్, విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, మరికొన్ని కాలేజీలు దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఈ కాలేజీల్లోనే పెలైట్ ప్రాజెక్ట్ చేపట్టాం. ఇప్పటికే బిట్స్ పిలానీలో ‘మన మాలి’ మొబైల్ యాప్‌ను ప్రారంభించాం. వచ్చే నెలలో వీఎన్‌ఆర్‌లో స్టార్ట్ చేయబోతున్నాం.
 
యాప్ పనిచేసే విధానం...
ముందుగా ఎంచుకున్న కళాశాలల్లో సర్వే చేసి వాళ్లు ఇచ్చిన సమాధానాల ఆధారంగా స్ట్రెస్ లేనివాళ్లు, కొంచెం ఒత్తిడి ఫీలవుతున్నవాళ్లు, అధిక ఒత్తిడికి గురవుతున్నవాళ్లు... ఇలా మూడు భాగాలుగా గుర్తిస్తాం. వారికి అవసరమైన ప్రోగ్రామ్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేస్తాం. దీని ద్వారా విద్యార్థులు నేరుగా మానసిక నిపుణులను సంప్రదించవచ్చు. విద్యార్థుల మానసిక స్థితిని బట్టి వారికి టెక్ట్స్, ఫొటోలు, వీడియోల రూపంలో ఒత్తిడిని ఎలా నివారించవచ్చో నిపుణులు వివరిస్తారు.

ఎనిమిది వారాలపాటు ఆ సలహాలను పాటించి మానసిక ఒత్తిడిని నియంత్రించొచ్చు. ఆన్‌లైన్‌లో ముఖాముఖి ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ‘ఈ యాప్‌లో విద్యార్థులకు పూర్తి ప్రైవసీ ఉంటుంది. స్టూడెంట్స్ వ్యక్తిగత సమస్యలు, సమాచారం ఏమాత్రం బయటికి తెలియవు’ అని  చెబుతున్నారు నిత్య. ప్రస్తుతం ఈ యాప్ ధర యూఎస్‌లో 250 డాలర్లు. మన దేశంలో పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తరువాతే ధర నిర్ణయించనున్నారు. యాప్ గురించి మరింత సమాచారం కోసం ఠీఠీఠీ.జ్చ్టౌ్ఛట.ఛిౌఝ చూడొచ్చు.
 ..:: గుంటుపల్లి దత్తసాయి, గాజులరామారం
 ..:: ఇక్కి సురేందర్,జగద్గిరిగుట్ట
 
మాదీ హైదరాబాదే..
మా స్వస్థలం హైదరాబాదే. మా డాడీ డాక్టర్ రామకృష్ణప్రసాద్. మా తాతగారు ప్రముఖ రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త కేఎల్‌ఎన్ ప్రసాద్. ఇక్కడున్న బంధువులు, ఫ్రెండ్స్‌ని కలిసేందుకు తరచూ సిటీకి వస్తుంటాను. ఇక్కడకు వచ్చినప్పుడల్లా.. వర్సిటీలలో చదువుతున్న స్టూడెంట్స్ చాలా స్ట్రెస్‌కు గురవుతుండటాన్ని అబ్జర్వ్ చేశాను. మానసిక ఆరోగ్యం సరిగా లేకుండా మనం ఏ రంగంలోనూ సక్సెస్ కాలేం. మానసిక ఒత్తిడికి చిత్తవుతున్న స్టూడెంట్స్ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించలేక మధ్యలోనే ప్రయత్నాలను విరమించుకుంటున్నారు. ఇది వారికే కాదు.. సమాజానికీ నష్టమే.

స్ట్రెస్ లెవల్స్‌ను తమకు తామే గుర్తించేలా, వాటి గురించి నేరుగా మానసిక నిపుణులకే చెప్పుకొనేలా, వాటిని తగ్గించుకునేలా అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించాలనే ఆలోచన నుంచే ‘మన మాలి’ కాన్సెప్ట్ పుట్టింది.గార్డెన్‌ను గార్డెనర్ తను అనుకున్న విధంగా తీర్చిదిద్దగలడు. అలాగే మనసుకూ ఓ గార్డెనర్ ఉంటే.. అదే ‘మన మాలి’. దీని అమలుకు హైదరాబాద్‌ను పెలైట్ ప్రాజెక్ట్‌గా ఎంచుకున్నా. బిట్స్ పిలానీ, వీఎన్‌ఆర్ కాలేజ్‌ల నుంచి ఏడు వేల మందిపై సర్వే చేసి ఆసక్తి ఉన్న 500 మంది విద్యార్థులకు ఈ యాప్‌ను అందిస్తాం. ఈ ప్రాజెక్ట్‌పై 60 వేల అమెరికన్ డాలర్లను వెచ్చిస్తున్నాం.
 
సమస్య చెప్పుకోవడానికో దారి..

సాధారణంగా మనకు మానసిక ఇబ్బంది ఉందని ఎవరికైనా చెప్పుకోవాలంటే భయం. ఎందుకంటే, అలా చెబితే మనల్ని పిచ్చోళ్లని చూసినట్టు చూస్తారు. కాబట్టి ఎప్పటికీ ఎంత దగ్గరి వారికైనా మానసిక సమస్యల గురించి చెప్పుకోలేం. ఈ యాప్ వల్ల ఎవరికి వారికి ప్రైవసీ ఉంటుంది. మన ఇబ్బందిని నేరుగా నిపుణులకే చెప్పుకోవచ్చు. సైకాలజిస్ట్‌కు కూడా మనం ఎవరమో తెలియాల్సిన అవసరం లేదు. అసలు మనం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నామనే విషయం కూడా ఎవరికీ తెలియదు.
 - అఫ్రోజ్, విద్యార్థి, విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్
 
అందరూ ఒత్తిడి బాధితులే..

 విద్యార్థులే కాదు.. నేడు అందరూ ఒత్తిడితో బాధపడుతున్నారు. స్ట్రెస్ అనేది రకరకాలుగా కలుగుతుంది. దానిని ఎదుర్కోవడానికి, రెండో కంటికి తెలియకుండా త్రూ టెక్నాలజీ ద్వారా ట్రీట్‌మెంట్ పొందడం అనేది సంతోషం కలిగించే విషయం. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకునే వారికి ఈ యాప్ మంచి ఉపయోగకారి.
 - రోషిత, విద్యార్థిని, విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్
 
సెల్ఫ్‌చెక్ ఈజీ..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుంటూ రూపొందించిన ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. మాకు రోజూ కాలేజీకి వచ్చి వెళ్లడానికే నాలుగు గంటల సమయం పడుతుంది. ఆ సమయంలో యాంగ్జైటీ లెవల్స్‌ను సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి, మనల్ని మనం దారిలో పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.    
- సుధీర్, విద్యార్థి, విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement