
నుమాయిష్ ఏర్పాట్లు చకచకా
- ఈసారి 2500 స్టాల్స్ నిర్మాణం
- తొలిసారిగా ఇతర దేశాల ఉత్పత్తులు సైతం..
అబిడ్స్: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)కు చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 46 రోజుల పాటు నగరవాసులను అలరించనున్న ఎగ్జిబిషన్‌ను ఈసారి సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈమేరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్టాల్స్ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. దాదాపు 60-70 శాతం పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.
మొదటిసారిగా ఇతర దేశాల ఉత్పత్తులు
ఈ సంవత్సరం తొలిసారిగా స్వదేశీతోపాటు ఇండోనేషియా, ఈజిప్ట్, మలేషియా దేశాలు సైతం తమ ఉత్పత్తులను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ మూడు దేశాల వినతులు పరిశీలనలో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. అందరి ఆమోదంతో ఈ స్టాల్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
2500 స్టాల్స్ ఏర్పాటు
ఎగ్జిబిషన్‌లో ఈ సారి కూడా దాదాపు 2500 స్టాల్స్ ఏర్పాటుకు అనుమతిస్తున్నాం. వివిధ స్టాళ్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగుతోంది, ఈ నెల చివరి వరకు పనులు పూర్తవుతాయి. చుక్‌చుక్ రైలుతో పాటు వినోదాత్మకమైన అమ్యూజ్‌మెంట్ విభాగాలను కూడా ప్రారంభిస్తాం. సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా స్టాళ్ల నిర్మాణం కొనసాగుతుంది. మూడు ప్రధాన గేట్ల ద్వారా ప్రతి సందర్శకున్ని తనిఖీ చేసిన తరువాతనే లోపలికి అనుమతిస్తాం.
- అనిల్ స్వరూప్ మిశ్రా, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు
సందర్శకులకు అన్ని వసతులు
ఎగ్జిబిషన్ సందర్శకుల సౌకర్యార్థం సొసైటీ ఆధ్వర్యంలో మంచినీరు, ఇతర వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఎగ్జిబిషన్ నలుమూలలా 32 హై క్వాలిటీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలోనే మెటల్ డిటెక్టర్‌లు, హ్యాండ్ మెటల్ డిటెక్టర్‌లు అమరుస్తున్నాం. ప్రతి సన్నివేశాన్ని సీసీ కెమెరాలో బంధిస్తాం. అంతేకాకుండా పోలీసులకు తోడుగా సొసైటీ ఆధ్వర్యంలో కూడా సెక్యూరిటీ విభాగం ఉంటుంది.
- వనం సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి