
గజ గజ
‘‘సాయంత్రం 5 గంటలు...నాంపల్లి నుంచి పంజగుట్టకు వెళ్లేందుకు విజయ్ ద్విచక్రవాహనంపై బయలుదేరాడు.
బీభత్సం సృష్టించిన గాలివాన
గంటకు 60 నుంచి 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
వేలాదిగా నేలకూలిన చెట్లు.. విద్యుత్ స్తంభాలు
కుప్పకూలిన విద్యుత్ సరఫరా వ్యవస్థ
వందలాది కాలనీల్లో కారు చీకట్లు భారీగా ట్రాఫిక్ జామ్‌లు
సిటీబ్యూరో: ‘‘సాయంత్రం 5 గంటలు...నాంపల్లి నుంచి పంజగుట్టకు వెళ్లేందుకు విజయ్ ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. జడివాన కురియడంతో రహదారిపై ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించింది. లక్డీకాపూల్ నుంచి పంజగుట్ట వరకు వేలాది వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ట్రాఫిక్ రద్దీలో పంజగుట్ట చేరుకునేందుకు మూడు గంటల సమయం పట్టింది. రాత్రి 8 గంటలకు కాని పంజగుట్ట చేరుకోవాల్సి వచ్చింది’’.
‘‘సమయం సాయంత్రం 5.30 గంటలు...అమీర్‌పేట్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు స్నేహ బస్సులో బయలుదేరింది. రాత్రి 8.50 గంటలకు గాని సికింద్రాబాద్ స్టేషన్ చేరుకోలేదు’’. ‘‘పవన్ హైటెక్‌సిటీ నుంచి సాయంత్రం 6 గంటలకు తన కారులో దిల్‌సుఖ్‌నగర్‌కు బయలుదేరాడు. రాత్రి 9.30 గంటలకు ఇళ్లు చేరాల్సి వచ్చింది’.
ఇవన్నీ గ్రేటర్‌లో శుక్రవారం కురిసిన జడివానకు లక్షలాదిమంది వాహనచోదకులు, ప్రయాణికులు పడిన నరకయాతన ఇది. సాయంత్రం 5 నుంచి 6 గంటలవరకు కురిసిన జడివానతో ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు,వృద్ధులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని విలవిల్లాడారు. కుండపోత వర్షానికి తడిసి ముద్దవడంతోపాటు అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేక నరకయాతన అనుభవించారు. ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో బయలుదేరిన వారు కూడా రాత్రి పొద్దుపోయాక గాని ఇంటికి చేరుకోలేక పోయారు. ఫ్లైఓవర్లపైనా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ప్రధాన రహదారులు, షాపింగ్‌మాల్స్ ఎదుట పార్క్ చేసిన వాహనాలపై చెట్లు, హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. రహదారులపై మోకాళ్లలోతు వరదనీరు పోటెత్తింది. బహదూర్‌పురా, గాంధీనగర్, కాలాపత్తర్, చార్మినార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, ఎస్.ఆర్.నగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి, మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రాంతాల్లో వర్ష విలయానికి లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగాయి. నాలాలు ఉప్పొంగాయి. పురాతన భవనాల సమీపంలో ఉన్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాత్రంతా జాగారం చేయాల్సిన దుస్థితి తలెత్తింది.
ఉప్పొంగిన నాలాలు,డ్రైనేజి లైన్లు..
కుండపోత కురియడంతో నాలాలు, డ్రైనేజి లైన్లు పొంగిపొర్లాయి. మూతలు లేని మ్యాన్‌హోళ్ల వద్ద వరద ప్రవాహం భయానకంగా మారింది. పలు లోతట్టు ప్రాంతాలు, బస్తీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో వరదనీటిని తొలగించేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. లక్డికాపూల్, చింతల్‌బస్తీ, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో రహదారులపై పార్కింగ్ చేసిన వాహనాలు నీటి మునిగేంత స్థాయిలో వరద పోటెత్తింది. గ్రేటర్‌లో ప్రధాన రహదారులపై 100 లోత ట్టు ప్రాంతాల(వాటర్‌లాగింగ్ పాయింట్స్)వద్ద భారీగా వర్షపునీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
ట్రాఫిక్ జామ్
రహదారులపై వరద పోటెత్తడంతో నెక్లెస్‌రోడ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజగుట్ట, నాంపల్లి,సెక్రటేరియట్, అమీర్‌పేట్, ఎస్.ఆర్.నగర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, అబిడ్స్, కోఠి, బంజారాహిల్స్, సికింద్రాబాద్, మసాబ్‌ట్యాంక్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జాంబాగ్, ఎర్రమంజిల్, లక్డికాపూల్,సికింద్రాబాద్,ఆబిడ్స్,కోఠి,తార్నాక, తదితరప్రాంతాలతోపాటు బేగంపేట్,సికింద్రాబాద్,ఖైరతాబాద్ ప్రాంతాల్లోనూ ఫ్లైఓవర్ల మీద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయం....
సికింద్రాబాద్‌లోని అంబేద్కర్‌నగర్, ఇందిరమ్మనగర్, రసూల్పురా,అన్నానగర్,గాంధీనగర్‌లలోని లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. మెహిదీపట్నంలో గుడిమల్కాపూర్-మందుల బస్తీ,నదీంకాలని,అంజయ్యనగర్ ప్రాంతాల్లో భారీగావర్షపు నీరు చేరడంతో స్థానికులు నానా అవస్థలు పడ్డారు. అంబర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కుత్భుల్లాపూర్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్, చార్మినార్, బహదూర్‌పురా, శేరిలింగంపల్లి, తార్నాక, ఉప్పల్‌లోనిపలు బస్తీల్లో వరద నీరు చేరింది. ఇక బేగంపేట్‌లో 14 ఎం.ఎం, రుద్రారం 8.9, లయోలా అకాడమీ 1.5, కండ్లకోయ 11.7, శంషాబాద్ 22.44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
గాలివాన కారణంగా నగరంలో అర్ధరాత్రి వరకు పలు కాలనీలు చీకట్లో మగ్గాయి. విద్యుత్ ట్రాన్‌సఫార్మర్లు, స్తంభాలు, చెట్లు కూలిన కారణంగా ఫీడర్లు ట్రిప్పయి విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్థమైంది.