గులాబీ గూటికి వలసలు..
టీఆర్‌ఎస్‌లోకి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్యూ
* కారెక్కిన టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్
* అదేబాటలో దానం, మరికొందరు?
* షాక్‌లో టీటీడీపీ.. ఫిరాయింపులు అడ్డుకోలేక సతమతం
* రెండు రోజుల్లో కొందరు ముఖ్య నేతలు చేరుతారంటున్న గులాబీ వర్గాలు
* జీహెచ్‌ఎంసీ పీఠమే లక్ష్యంగా కసరత్తు
* మరింత మందిని ఆకర్షించే పనిలో సీనియర్ మంత్రులు
సాక్షి, హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్ పీఠం వలసలకు తెరలేపింది.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. గ్రేటర్‌ను కైవసం చేసుకునే దిశగా వ్యూహం పన్నిన అధికార టీఆర్‌ఎస్... మరింత మంది విపక్ష ఎమ్మెల్యేలు, నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. మరింత మందిని తమ వైపు తిప్పుకొనేందుకు పార్టీలో సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది. కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్‌లు గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్‌తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పేర్లు బయటకు వెల్లడించకపోయినా రెండు రోజుల్లో మరో టీడీపీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరుతారని ఆ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.
మరింత ముమ్మరం..
గ్రేటర్ పీఠంపై జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కనీసం వంద డివిజన్లలో విజయం కోసం టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. ఈ నెల రెండో వారం తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో... ఆలోగానే ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి చేర్చుకోవడంలో నిమగ్నమైంది. టీడీపీ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద, ప్రకాష్‌గౌడ్‌లు టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపుగా ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది. వారిలో ఇద్దరు రెండు రోజుల్లోనే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని సీనియర్ మంత్రి ఒకరు సూచనప్రాయంగా వెల్లడించారు. ఇక జీహెచ్‌ఎంసీ మేయర్ పదవిని ఆశిస్తున్న దానం నాగేందర్ ఈ విషయాన్ని ఇప్పటికే టీఆర్‌ఎస్ అధినాయకత్వం చెవిన వేశారు. దీనిపై సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్న ఆయన... సోమవారం తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
చర్చలు జరుపుతున్న హరీశ్‌రావు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలతో మంత్రి హరీశ్‌రావు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరితే భవిష్యత్‌లో వారి రాజకీయ ప్రయోజనాలకు ఎలాంటి ఢోకా ఉండదని నేరుగా సీఎం కేసీఆర్ హామీ ఇస్తున్నట్లు తెలిసింది. ముందుగా ఫోన్‌లో కేసీఆర్‌తో మాట్లాడాకే వారు పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకుంటున్నారు. టీటీడీ బోర్డు పదవినివదులుకున్న సాయన్నకు ఆ స్థాయి ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇస్తామన్న హామీ తరువాతే... ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే 'ఇంకో రెండు రోజుల్లో మరికొందరు ప్రముఖులు టీఆర్‌ఎస్‌లో చేరుతారు. మీరే చూస్తారుగా.. జంట నగరాల్లో కాంగ్రెస్, టీడీపీ దాదాపు ఖాళీ అవుతాయి..' అని సీనియర్ మంత్రి ఒకరు పేర్కొనడం గమనార్హం.
షాక్‌లో టీ టీడీపీ..
వలసలతో తెలంగాణ టీడీపీ సతమతం అవుతోంది. పార్టీని వీడితున్న వారిని ఎలా అడ్డుకోవాలో అర్థం కాక ఆ పార్టీ నాయకత్వం తలపట్టుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక విధంగా అధికార పార్టీ వ్యూహాలను ఎదుర్కోలేక చేతుత్తేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీకి నమ్మకమైన నేతగా పేరున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న పార్టీని వీడివెళతారని తాము ఊహించలేదని తెలంగాణ టీడీపీ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల సమయంలోనే సాయన్న పార్టీ మారతారని ప్రచారం జరిగినా... ఆయన టీడీపీతోనే ఉన్నారు. దీంతో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా నియమించారు. అయినా సాయన్న గురువారం టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదివరకే నగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు గులాబీ గూటికి చేరారు. ఇక రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా గులాబీ దళంలో చేరనున్నారని చెబుతున్నారు. అయితే తాను పార్టీ మారుతున్నట్లు జరిగిన ప్రచారాన్ని ప్రకాశ్‌గౌడ్ ఖండించారు.