
రంగనాథ్‌కు కన్నీటి వీడ్కోలు
♦ బన్సీలాల్‌పేట శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు
♦ కదలివచ్చిన తెలుగు చిత్రసీమ.. మంచి నటుడిని కోల్పోయామని ఆవేదన
♦ ఇంతపని చేస్తాడని ఊహించలేదని కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
♦ రంగనాథ్‌ది ఆత్మహత్యేనని తేల్చిన పోస్ట్‌మార్టం నివేదిక
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ అంత్యక్రియలు ఆదివారం బన్సీలాల్‌పేట హిందూ శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. ఆయన కుమారుడు నాగేంద్ర దహన సంస్కారాలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, సన్నిహితులు, తెలుగు చిత్ర సీమ ప్రముఖులు రంగనాథ్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న రంగనాథ్ భౌతికకాయాన్ని పోస్ట్‌మార్టం అనంతరం ఫిల్మ్‌నగర్‌లోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యాలయానికి తరలించారు. అక్కడ తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖులంతా రంగనాథ్‌కు నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడిపెట్టారు. ఆయన మరణంతో తెలుగుచిత్ర సీమ మంచి నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రంగనాథ్ భౌతికకాయాన్ని గాంధీనగర్‌లోని ఆయన పెద్ద కుమార్తె నీరజ నివాసానికి అక్కడి నుంచి బన్సీలాల్‌పేట శ్మశాన వాటికకు తరలించారు.
తండ్రి మరణవార్త తెలియగానే కుమారుడు నాగేంద్ర, చిన్న కుమార్తె శైలజ బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పెద్ద కుమార్తె నీరజ మాట్లాడుతూ కొన్నిరోజులుగా గడ్డం కూడా తీసుకోకుండా తన తండ్రి డల్‌గా ఉన్నారని చెప్పారు. ఆధ్యాత్మిక చింతన, ఉన్నత విలువలతో జీవించిన తమ తండ్రి .. అభిమానులను కూడా తమలాగే చూసేవారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. రంగనాథ్ కుమారుడు నాగేంద్ర మాట్లాడుతూ తన తండ్రి సున్నితభావంతో ఉండేవా
రని, తక్కువగా మాట్లాడినా ఎక్కువగా పనిచేసేవారని చెప్పారు. తన తండ్రితో నెల క్రితమే మాట్లాడానని, తన తల్లి చనిపోయిన తర్వాత పనిమనిషి మీనాక్షి ఆయనకు వంటచేసిపెట్టేదని అన్నారు. అందుకే ఆమె పట్ల ఆదరణ చూపారన్నారు. ఇదిలా ఉంటే రంగనాథ్ వంటమనిషి మీనాక్షి పేరుతో లక్షన్నర రూపాయలతో ఒకటి, మూడున్నర లక్షలతో మరో ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆంధ్రాబ్యాంక్‌లో వేశారని, మీనాక్షికి డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరు చే యాలని ఇటీవల రంగనాథ్ నగర మంత్రి తల సాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఫోన్ చేసి అపాయిం ట్‌మెంట్ కోరినట్లు సన్నిహితులు తెలిపారు.
తర్వాత తింటా అన్నారు: వంటమనిషి
శనివారం మధ్యాహ్నం 12.30కి వంటచేసి భోజనం చెయ్యమంటే ఆకలిగా లేదని, రెండున్నర గంటలకు తింటానని చెప్పారని వంటమనిషి మీనాక్షి చెప్పింది. తన కోసం కొంత మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలగా ఉందని చెప్పింది.
పస్తుండి ప్రాణం తీసుకున్నారు!
గంభీరమైన కంఠం... ఆకట్టుకునే ఆహార్యంతో వెండి, బుల్లితెరలపై వెలిగిన నటుడు రంగనాథ్. చనిపోయే రోజు మాత్రం పూర్తిస్థాయిలో పస్తు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆయన మృతదేహానికి గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యుడు డాక్టర్ రమణమూర్తి పోస్టుమార్టం నిర్వహించారు. గొంతుపై ఉన్న మచ్చలతో పాటు ఇతర ఆనవాళ్ల నేపథ్యంలో రంగనాథ్‌ది ఆత్మహత్యగా వైద్యులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం కడుపులో ఉన్న ద్రావణాలు (విస్రా) సేకరించారు. ఆయనను ఆఖరిసారిగా చూసింది పనిమనిషి మీనాక్షే. శనివారం మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో వంట పూర్తి చేసిన ఈమె.. భోజనం చేయమని చెప్పి వెళ్లింది.
అయినప్పటికీ రంగనాథ్ ఏమీ తీసుకోలేదని తేలింది. ఆత్మహత్య చేసుకునే సమయానికి కడుపులో ఉన్న ఘన, ద్రవ పదార్థాలు అలానే మిగిలిపోతాయి. రంగనాథ్ మృతదేహంలో ఆహారానికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని రమణమూర్తి తెలిపారు. మరోవైపు ఎప్పుడూ నీట్ షేవ్‌తో ఉండే రంగనాథ్ కొన్ని రోజులుగా గడ్డం కూడా గీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారం ఆయన శనివారం సాయంత్రం ఓ సన్మానానికి హాజరుకావాల్సి ఉంది. అయినప్పటికీ మృతదేహం ముఖం మాసిన గడ్డంతో ఉందని తెలిపారు. వీటిని బట్టి ఆయన ఆత్మహత్య హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, తీవ్ర మానసిక వేదనతో జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.