గోల్కొండ ఖ్యాతికి ‘మసక’
♦ సౌండ్ అండ్ లైట్ షోలో తరచూ సాంకేతిక సమస్యలు
♦ అర్ధంతరంగా నిలిచిపోతున్న ప్రదర్శనలు
♦ ఉత్సాహంగా వచ్చి ఉసూరుమంటున్న విదేశీ పర్యాటకులు
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యాటకులు ముచ్చటపడి వచ్చారు.. క్యూలో నిలబడి టికెట్ కొని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో అంతా చీకటి.. ఓ మూలన తళుక్కుమంటూ కాంతి విరజిమ్మింది..! ‘‘రండి.. రండి.. మీకు సాదర స్వాగతం.. ఈ రోజు ప్రపంచ ప్రసిద్ధి గల ఈ గోల్కొండ కథ చెబుతాను.. ఇక్కడి రాళ్లకు జీవమే వస్తే హృదయాన్ని హత్తుకునేలా ఎన్ని కమనీయ కథలు చెప్పేవో.. ’’ అంటూ హిందీ, ఇంగ్లిష్‌లో గంభీరంగా అమితాబ్ బచ్చన్ గొంతు..! అంతే అందరిలో తెలియని పులకింత. మరోపక్క ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు రంగు లైట్ల కాంతి లయబద్ధంగా కదలాడుతుంటే ప్రేక్షకుల్లో తన్మయత్వం! ఇంతలో గర్‌ర్‌ర్‌మంటూ శబ్దం.. ఆ వెంటనే నిలిచిపోయిన మాటలు.. లైట్ల కాంతిలోనూ మసక... షో ఆగిపోయింది.
‘‘సారీ.. సాంకేతిక కారణాలతో ఈ షోను రద్దు చేస్తున్నాం. మీ టికెట్ డబ్బులు వాపసు చేస్తాం తీసుకోండి..’’ అంటూ సిబ్బంది సూచన. విదేశీ పర్యాటకుల్లో తీవ్ర అసంతృప్తి... ఉసూరుమంటూ నిష్ర్కమణ.. గోల్కొండ కోట వద్ద సౌండ్ అండ్ లైట్ షోలో పరిస్థితి ఇదీ! ప్రపంచవ్యాప్తంగా చారిత్రక కట్టడాల వద్ద నిర్వహించే ఈ సౌండ్ అండ్ లైట్ షో అన్నింట్లోకెల్లా గోల్కొండ వద్ద ప్రదర్శించే షో ప్రత్యేకతే వేరు! దీన్ని అనుసరిస్తూ ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు గొప్ప ఖ్యాతిని మూటగట్టుకున్న ఈ షో ఇప్పుడు సాంకేతిక లోపాలతో విదేశీ పర్యాటకుల ముందు మన పరువు తీస్తోంది.
మధ్యలో నిలిచిపోతున్న షోలు
కోట వద్ద ప్రతిరోజూ తొలుత గంటపాటు ఆంగ్లంలో, ఆ తర్వాత గంటపాటు హిందీ/తెలుగు భాషల్లో రెండు విడతలుగా సౌండ్ అండ్ లైట్ షో ప్రదర్శన 23 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. పాతబడ్డ సౌండ్ అండ్ లైట్ షో వ్యవస్థ మొరాయిస్తోంది. దీంతో మధ్యలోనే ఆపేసి పర్యాటకులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించి పంపుతున్నారు. పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఆ షోను ఎలాగోలా నిర్వహించేందుకు పర్యాటకశాఖ అధికారులు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. దీన్ని ఆధునీకరించేందుకు రూ.4 కోట్లతో ప్రతిపాదనలు పంపినా మోక్షం లభించటం లేదు.
మరమ్మతు చేసినా మారని పరిస్థితి
ఈజిప్టులో ఇలాంటి ప్రదర్శన గురించి 1988లో తెలుసుకున్న అప్పటి సీఎం ఎన్టీఆర్ ఆదేశం మేరకు 1993లో గోల్కొండలో ఈ ప్రదర్శన మొదలైంది. అప్పుడు ఏర్పాటు చేసిన లైట్లు, సౌం డింగ్ వ్యవస్థనే ఇప్పటివరకూ కొనసాగుతోంది. దీంతో అది దెబ్బతినడంతో కొద్దిరోజుల క్రితమే రూ.కోటితో మరమ్మతు చేయించా రు. అయినా తరచూ షో మొరాయిస్తోంది. పాతకాలం నాటి హాలోజన్ లైట్లను మార్చేసి ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని, మంచి సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.