సీఎం కొత్త అధికారిక నివాసానికి శంకుస్థాపన
నూతన సముదాయంలో అధికారిక నివాసం, కార్యాలయం, సమావేశ మందిరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, కార్యాలయం, సమావేశ మం దిరంతో కూడిన నూతన భవన సముదాయానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం శంకుస్థాపన చేశారు. ప్రస్తుత క్యాంపు కార్యాలయం పక్కనే కొత్త భవన సముదాయం నిర్మించేందుకు అత్యంత నిరాడంబరంగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు, సందర్శకులను కలుసుకోవడానికి ప్రస్తుత క్యాంపు కార్యాలయం ఏ మాత్రం అనువుగా లేనందున కొత్త కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. నూతన భవన సముదాయం అవశ్యకతను వివరిస్తూ ఈ మేరకు ఓ ప్రకటనను జారీ చేసింది.
హోటళ్లు, వర్సిటీల్లో సమావేశాలు..
రాష్ట్ర విభజన తర్వాత జూబ్లీహాల్‌ను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నిర్వహణకు కేటాయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నా, ఇతర ముఖ్య సమావేశాలు జరుపుకోవాలన్నా సరైన సమావేశ మందిరం అందుబాటులో లేదు. దీంతో హోటళ్లలో సమావేశాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్షేత్ర స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించుకోవాలంటే జేఎన్టీయూ, వ్యవసాయ వర్సిటీలకు వెళ్లాల్సిందే. మిషన్ కాకతీయ సమావేశం జేఎన్టీయూలో, మిషన్ భగీరథ సమావేశాన్ని వ్యవసాయ వర్సిటీలో పెట్టుకోవాల్సి వచ్చింది. మంత్రివర్గ సమావేశం నిర్వహించినప్పుడు భోజనాల కోసం మంత్రులు బయట హోటల్‌కు వెళ్తున్నారు. ఈ అవసరాలకు సరిపడా సమావేశ హాలు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోగానీ, సచివాలయంలో కానీ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ముఖ్యమంత్రి కూడా తన అధికారిక నివాసంలో ప్రతీ రోజు సమీక్షలు నిర్వహిస్తారు. విధాన నిర్ణయాల కోసం, పరిపాలన సమన్వయం కోసం ముఖ్య అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. దీనికి కూడా ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీకో.. మరో చోటికో వెళ్లాల్సి వస్తోంది.
8.9 ఎకరాల స్థలంలో నూతన సముదాయం
ఇక ముఖ్యమంత్రిని కలవడానికి నిత్యం వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, దేశవిదేశీ ప్రముఖులు వస్తున్నారు. కానీ, వారి కార్లు కూడా క్యాంపు కార్యాలయంలో పార్క్ చేసే పరిస్థితి లేదు. ప్రస్తుత క్యాంపు కార్యాలయంలో ఒక్క ముఖ్యమంత్రి కారు తప్ప మిగతా కార్లు సరిపోవు. మిగతా కార్లన్నీ రోడ్డుపై ఉండాల్సిందే. ఓ ఐదొందల మంది సీఎం కార్యాలయానికి వస్తే వారికి నిలువ నీడ కూడా ఉండడం లేదు. ఫలితంగా సందర్శకులను ముఖ్యమంత్రి కలవలేకపోతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిత్యం సమావేశాలు పెట్టుకోవడానికి వీలుగా, కనీసం వెయ్యి మంది పట్టే సమావేశ మందిరంతో కూడిన ముఖ్యమంత్రి అధికారిక నివాసం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఆర్‌అండ్‌బీ శాఖ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం, కార్యాలయం, సమావేశ మందిరం ఉండే విధంగా పంజగుట్టలోని 8.9 ఎకరాల స్థలంలో భవన సముదాయం నిర్మించాలని నిర్ణయించారు దీనిలో భాగంగానే సీఎం అధికారిక నివాస సముదాయానికి శనివారం శంకుస్థాపన చేశారని సీఎంవో తెలిపింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.