తెలంగాణకు కశ్మీర్ తరహా ప్యాకేజీ ఇవ్వాలి
♦ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్
♦ విశ్వనగరం పనులకు మూడు చోట్ల శంకుస్థాపనలు
♦ 3 మల్టీలెవెల్ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు ప్రారంభం
♦ విశ్వనగరానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది: దత్తాత్రేయ
హైదరాబాద్: దశాబ్దాలపాటు అణచివేతకుగురై కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు బిహార్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల తరహాలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్) డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మల్టీలెవెల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి 54 జంక్షన్లను గుర్తించామని, వీటి నిర్మాణానికి కేంద్రం సాయం కోరతామని చెప్పారు. తమకు న్యాయంగా దక్కాల్సిన నిధులను కేంద్రం ఇచ్చి తీరాల్సిందేనన్నారు. విశ్వనగరం పనుల్లో భాగంగా ఆదివారం కూకట్‌పల్లి, బంజారాహిల్స్, మాదాపూర్‌లో నిర్మించతలపెట్టిన మల్టీలెవెల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగాయి.
తొలుత జేఎన్‌టీయూ రెండో గేట్ నుంచి మలేసియా టౌన్‌షిప్ వరకూ రూ.113 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మల్టీలెవెల్ ఫ్లైఓవర్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. కూకట్‌పల్లితో పాటు నగరంలోని అన్ని రద్దీ కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణకు మల్టీలెవెల్ ఫ్లైఓవర్లను నిర్మించేందుకు రూ. 20 వేల కోట్లతో ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిందన్నారు.
తెలంగాణ ఏర్పడకముందు విపక్షాలు ఎన్నో దుష్ర్పచారాలు చేశారని, ముఖ్యంగా భూముల ధరలు తగ్గుతాయని, నగరంలో శాంతిభద్రతల సమస్య నెలకొంటుందని ప్రచారం చేశాయని, కానీ ఇప్పటి వరకు నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెప్పారు. నగర ప్రజలకు 24 గంటలూ విద్యుత్ అందిస్తున్నామని, రాష్ట్రానికి పెట్టుబడులు విరివిగా వస్తున్నాయని, పాత ఐటీ పరిశ్రమలకు తోడు కొత్తగా మరిన్ని సంస్థలు కార్యకలాపాలను సాగించేం దుకు ముందుకొచ్చాయని తెలిపారు. నగరంలో నివసిస్తున్న తెలంగాణేతర ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని నమ్మవద్దని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.
కేంద్రం సహకరిస్తుంది: దత్తాత్రేయ
బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద రూ.510 కోట్ల వ్యయంతో నిర్మించబోయే మల్టీలెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పలువురు రాష్ట్ర మంత్రులతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద నగరంగా, దేశంలోనే నంబర్ 1 నగరంగా మారబోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను అత్యధికంగా రాబట్టి విశ్వనగర ప్రణాళికకు తాము కూడా సహకరిస్తామన్నారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తే.. ఆయనను తీసుకొచ్చే బాధ్యత తనదేనన్నారు.
యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడుతున్నాం
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. మాదాపూర్‌లో రూ.266 కోట్ల వ్యయంతో అయ్యప్ప సోసైటీ, మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ పార్క్ జంక్షన్‌లో నిర్మించే మల్టీలెవెల్ ఫ్లైఓవర్ పనులకు పలువురు మంత్రులతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో 800 కి.మీ. వైట్ టాపింగ్స్ రోడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఐటీ జోన్‌లో మంచినీటి వసతి, నాణ్యమైన కరెంట్‌ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, చింతల రాంచంద్రారెడ్డి, జీహెచ్‌ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.