పార్టీ బతకాలా ... పదవి ఇవ్వండి
తెలంగాణ టీడీపీ తమ్ముళ్లు కొత్త పాఠం ఒంటబట్టించుకున్నారు. తమ పనులు చక్కబెట్టుకోవడానికి అధినేత చంద్రబాబుకు ఏ మంత్రం వేయాలో ప్రావీణ్యం సంపాదించారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా ఒకరి వెనుక ఒకరు టీఆర్‌ఎస్ బాట పట్టడంతో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు, మాజీలే మిగిలారు. తెలంగాణలో పార్టీని బతికించుకోవాలంటే తమకు అధికార పదవులు కావాల్సిందేనని కొత్త మెలిక పెడుతున్నారు. ఏపీలో అధికారంలో ఉండడంతో అక్కడ కూడా పదవులు కావాలనే అత్యాశకు పోతున్న నాయకులు కొందరు నేరుగా అధినేత ముందే కోరికల చిట్టా విప్పుతున్నారు.
జాతీయ పార్టీ హోదా కొనసాగాలంటే తెలంగాణలో పార్టీ దుకాణం మూస్తే కుదరదన్న అవగాహనతో ఉన్న ఏపీ టీడీపీ పెద్దలు అవునన లేక, కాదనలేక మిన్నకుండి పోతున్నారు. ‘ఒక నాయకుడేమో ఏకంగా గవర్నర్ పదవి కోరుకుంటుంటే, మరో నాయకుడు రాజ్యసభ సభ్యత్వం కావాలంటుంటే, ఇంకో నేత టీటీడీ బోర్డు పదవి మాకివ్వరా అంటున్నారు. చివరకు ఏపీ ప్రభుత్వంలో ఒకటీ రెండు నామినేటెడ్ పదవులకూ గాలం వేస్తున్నారు. ఇదయ్యేదా.. పోయ్యేదా.. ఆశకు అంతుండక్కర్లేదా..’ అని పార్టీ నేత ఒకరు కుండబద్దలు కొట్టారు. వీరి గొంతెమ్మ కోర్కెలు వింటున్న పార్టీ అగ్రనేతలకు దిమ్మతిరిగి పోతోందట. మరంతే.. పదువుల్లేకుండా పార్టీని ఎలా కాపాడుతాం అంటూ కొత్త సూత్రీకరణ చేస్తున్నారట.
పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి పదవులున్న వారే గోడదూకిన చేదు అనుభవాల నేపథ్యంలో .. ఎన్నికల్లో ఓడిపోయిన వీరి కోసం ఏపీ నేతలను త్యాగం చేయమంటారా? నిజంగానే తెలంగాణ తమ్ముళ్లకు పదవీ యోగం పడుతుందా... అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి..