రాష్ట్రవ్యాప్తంగా 195 మసీదుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేస్తున్నామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
- రూ.12 కోట్లతో 2లక్షల కుటుంబాలకు దుస్తుల పంపిణీ
- రంజాన్ ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 195 మసీదుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేస్తున్నామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రంజాన్ పండుగ ఏర్పాట్లపై గురువారం అధికారులతో సమీక్ష అనంతరం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి ఇఫ్తార్ విందులను ఇస్తోందని, దేశంలోనే ప్రప్రథమంగా ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ ఏడాది ఇఫ్తార్ విందుల కోసం రూ.4 కోట్లు వెచ్చిస్తున్నామని, దాదాపు 2 లక్షల ముస్లిం కుటుంబాలకు రూ.12 కోట్లు వెచ్చించి దుస్తులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. సమీక్ష సమావేశంలో వక్ఫ్‌బోర్డ్ సీఈవో అసదుల్లా, ఈవో మునావర్, పలువురు ముస్లిం మతపెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.