చెన్నమనేనికి తాత్కాలిక ఊరట | Temporary relief to Chennamaneni | Sakshi
Sakshi News home page

చెన్నమనేనికి తాత్కాలిక ఊరట

Published Tue, Sep 12 2017 2:38 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

చెన్నమనేనికి తాత్కాలిక ఊరట - Sakshi

చెన్నమనేనికి తాత్కాలిక ఊరట

పౌరసత్వ రద్దు నిర్ణయం అమలును తాత్కాలికంగా నిలిపేసిన హైకోర్టు
 
సాక్షి, హైదరాబాద్‌: భారత పౌరసత్వం రద్దు కేసులో వేములవాడ టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌కు తాత్కాలిక ఊరట లభించింది. ఆగస్టు 31 నుంచి ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల (అబయన్స్‌) చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ సోమవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. తన పౌరసత్వం రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ రమేశ్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఆరు వారాల్లోగా పరిష్కరించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు.

కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రమేశ్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టులో అంతకుముందు జరిగిన విచారణలో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించే ముందు రమేశ్‌ వివరణ తీసుకోలేదని కోరలేదని రమేశ్‌ తరఫు న్యాయవాది వై.రామారావు వాదించారు. పౌరసత్వ రద్దు నిర్ణయాన్ని పునః సమీక్షించాలంటూ రమేశ్‌ చేసుకున్న దరఖాస్తు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. అనంతరం కేంద్రం తరఫున సహాయ పోలిసిటర్‌ జనరల్‌ లక్ష్మణ్‌ వాదిస్తూ రమేశ్‌ అనేక విషయాల్ని గోప్యంగా ఉంచి పౌరసత్వం తీసుకున్నట్లు తేలిందన్నారు.

భారత్‌లో 96 రోజులే ఉన్నా ఏడాదిపాటు ఉన్నట్లు చెప్పి భారత పౌర సత్వం పొందారని చెన్నమనేని చేతిలో ఎన్నికల్లో ఓడిపోయిన ఆది శ్రీనివాస్‌ (బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు) తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న కోర్టు...రమేశ్‌ పునఃసమీక్ష పిటిషన్‌పై 6 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఇరుపక్షాలు సంబంధిత పత్రాలతో కేంద్ర హోం శాఖ వద్ద వాదనల్ని వినిపించుకునే వెసులుబాటు కోసం పౌరసత్వ రద్దు నిర్ణయాన్ని అబయన్స్‌లో పెడుతూ ఆదేశించింది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement