ఓయూలో టెన్షన్
ఓ వైపు జన జాతర సభ..మరోవైపు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
సీఎంని ఆహ్వానిస్తున్నాం.. వస్తే సత్కరిస్తాం: జేఏసీ నేత కల్యాణ్
రేవంత్ రెడ్డిని అనుమతించరాదని మానవ హక్కుల కమిషన్‌కు విజ్ఞప్తి
సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు వర్సిటీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు సీఎం కేసీఆర్ పాలనా తీరుకు వ్యతిరేకంగా ‘తెలంగాణ జన జాతర’ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఏ జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం లెఫ్ట్ విద్యార్థి సంఘాలు, ఓయూ విద్యార్థి జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ‘నియంత పాలనపై విముక్తి గర్జన’ నిర్వహించాయి. వీటికితోడు మరో 34 విద్యార్థి సంఘాలు ప్రత్యేక జేఏసీగా ఏర్పడి జూన్ 2న దాదాపు 12 గంటలపాటు ‘తెలంగాణ జన జాతర’ సభ నిర్వహణకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సభకు ఎటువంటి అనుమతి లేదని వర్సిటీ వర్గాలు పేర్కొంటుండగా, ఎట్టి పరిస్థితుల్లోనూ సభను విజయవంతం చేస్తామని నిర్వాహకులు భీష్మించుకున్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, గద్దర్, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు హాజరుకానుండటంతో రాష్ట్రంలోని అన్ని వర్సిటీలనుంచి విద్యార్థులను సమీకరిస్తున్నారు. అంతేగాక ఆర్ట్స్ కాలేజ్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఓయూలో ఉదయం జాతీయ జెండా ఆవిష్కరణ, పీజీ పరీక్షలు కొనసాగనున్నందున వర్సిటీలోకి ఇతరుల ప్రవేశాలపై అధికారికంగా ఆంక్షలు విధించారు.
సీఎంను కూడా ఆహ్వానిస్తున్నాం...
‘జన జాతర సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ముఖ్య అతిథి హోదాలో ఆహ్వానిస్తున్నాం. సభలో పాల్గొంటే ఆయన్ని ఘనంగా సన్మానిస్తాం. ఆ తర్వాత ఆయన సభలో మేమూ పాల్గొంటాం. తెలంగాణ ఏర్పాటై రెండేళ్లు కావొస్తున్నా.. ఉద్యోగుల నియామకం చేపట్టకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. సభను అడ్డుకుంటే ప్రజా వ్యతిరేక పాలనపై పోరు చేపడతాం. అంతకుమందు పరేడ్ మైదానంలో జరిగే సీఎం సభను సైతం అడ్డుకుంటాం. విద్యార్థుల సహనాన్ని పరీక్షించొద్దు. మా సభ.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు వ్యతిరేకం కాదు. కేసీఆర్, ఆయన కుటుంబం చేస్తున్న అప్రజాస్వామిక పాలనను నిరసిస్తూనే.. మరోవైపు 1969 తెలంగాణ ఉద్యమంలో, మలి దశ ఉద్యమంలో అసువులు బాసిన విద్యార్థుల కుటుంబాలను సన్మానించేందుకు జరుపుకుంటున్నాం’ అని నిర్వాహకులు కల్యాణ్, దరువు ఎల్లన్న, సాంబశివ గౌడ్ పేర్కొన్నారు.
అడ్డుకోవాలనుకోవడం అవివేకం
విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభను అడ్డుకోవాలనుకోవడం అవివేకమని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ అన్నారు. జన జాతర సభకు బీజేవైఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. వీసీలను నియమించకుండా, ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర ఉద్యోగాలను భర్తీ చేయకుండ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ కుట్రలో పావులు కారాదని ఆయన కోరారు.
ఎవరూ అనుమతి కోరలేదు
జన జాతర సభకు అనుమతి కోసం ఎవరూ తమను సంప్రదించలేదని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ తెలిపారు. ‘విద్యార్థులు స్వయంగా సభ నిర్వహిస్తామంటే సభ వేదిక, సమయాన్ని బట్టి అనుమతి అంశాన్ని పరిశీలిస్తాం. సభలతో విద్యా వాతావరణం దెబ్బతింటుందని, ఓయూలో సభలకు అనుమతి లేదన్నారు. విద్యకు, విద్యార్థులకు సంబంధం లేని రాజకీయ సభలను నిర్వహించ కూడదన్నారు. అనుమతి లేకుండా సభలు నిర్వహిస్తే పోలీసు కేసులు పెడతామన్నారు. బయటి వ్యక్తులు ముఖ్యంగా రాజకీయ నాయకులు వర్సిటీలోకి వచ్చేందుకు అనుమతి తీసుకోవాలన్నారు. గురువారం ఓయూలో జరిగే తెలంగాణ జన జాతర సభకు టీవీ ఛానెళ్ల వోబీ వ్యాన్లను అనుమతించబోమన్నారు. నిబంధనలను ఉల్లంగించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.