
కన్నీళ్లు
{పజలకు తప్పని దాహార్తి
స్టోరేజి రిజర్వాయర్లు, పైప్‌లైన్లు లేక అవస్థలు
శివారు వాసులకు కష్టాలు
సిటీబ్యూరో: గ్రేటర్ శివారు వాసుల పరిస్థితి ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది. చెంతనే గంగ పొంగుతున్నా... తాగేందుకు వీలులేని దుస్థితి వారిది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 340 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కృష్ణా మూడో దశ, గోదావరి మంచినీటి పథకం మొదటి దశల ద్వారా ఈ ఏడాది చివరి నాటికి అదనంగా 262 ఎంజీడీలు నగరానికి తరలించే అవకాశముంది. కానీ ఆ నీటిని గ్రేటర్‌లో విలీనమైన శివారు మున్సిపాల్టీలు, గ్రామ, నగర పంచాయతీల పరిధిలోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీలకు సరఫరా చేసేందుకు అవసరమైన స్టోరేజి రిజర్వాయర్లు, పైప్‌లైన్ నెట్‌వర్క్ లేదు. దీంతో ఆ ప్రాంతాల దాహార్తి ఈ ఏడాదిలోనూ తీరే అవకాశాలు కనిపించడం లేదు.
డిమాండ్... సరఫరాల మధ్య అంతరం
ప్రస్తుతం 688 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్‌ఎంసీకి నిత్యం 340 మిలియన్ గ్యాలన్ల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. మహా నగరానికి ఆనుకొని ఉన్న శివారు ప్రాంతాల్లోని మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీల విస్తీర్ణం 519 చదరపు కిలోమీటర్లు. ఇటీవల జలమండలి అధికారులు ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికలో జీహెచ్‌ఎంసీ, శివారు ప్రాంతాల దాహార్తిని తీర్చాలంటే నిత్యం నగరానికి 732 ఎంజీడీల తాగునీరు అవసరమని సూచించారు. అంటే ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటికి, డిమాండ్‌కు మధ్య అంతరం 392 ఎంజీడీలు. ఈ కొరతలో కొంతైనా తీరాలంటే కృష్ణా మూడోదశ ద్వారా 90 ఎంజీడీలు, గోదావరి మొదటి దశ ద్వారా మరో 172 ఎంజీడీల నీటిని తరలిస్తే మొత్తం 262 ఎంజీడీల నీరు నగరానికి వస్తుంది.అయినప్పటికీ 130 ఎంజీడీల కొరత తప్పదు.
పైప్‌లైన్లు లేకపోవడమే శాపం
గ్రేటర్‌లో విలీనమైన కొన్ని శివారు మున్సిపాల్టీల పరిధిలో మంచినీటి సరఫరాకు అవసరమైన పైప్‌లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. జలమండలి తాజా నివేదిక ప్రకారం శేరిలింగంపల్లిలో 96.99 కి.మీ., కుత్బుల్లాపూర్ పరిధిలో 52.02 కి.మీ., రామచంద్రాపురంలో 19.28 కి.మీ., పటాన్‌చెరువులో 15.6 కి.మీ., కాప్రాలో 43.81 కి.మీ., అల్వాల్‌లో 26.32 కి.మీ., కూకట్‌పల్లిలో 43.12 కి.మీ., ఎల్బీనగర్‌లో 64.61 కి.మీ., గడ్డిఅన్నారంలో 2.12 కి.మీ., ఉప్పల్‌లో 21.97 కి.మీ., రాజేంద్రనగర్‌లో 50.97 కి.మీ. మేరకు తక్షణం మంచినీటి పైప్‌లైన్లు వేయాల్సి ఉంది. అప్పుడే సంబంధిత మున్సిపల్ సర్కిళ్లలోని కాలనీలు, బస్తీలకు తాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఇందుకు రూ.3,195 కోట్లు అవసరమని ముఖ్యమంత్రికి జలమండలి నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి నెట్‌వర్క్ విస్తరణ పనులు చేపడితేనే శివారు ప్రాంతాల దాహార్తి తీరుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.