23 నుంచి తుది విడత ఎంసెట్ కౌన్సెలింగ్ | The final installment of EAMCET counseling 23 onwords | Sakshi
Sakshi News home page

23 నుంచి తుది విడత ఎంసెట్ కౌన్సెలింగ్

Published Fri, Jul 8 2016 7:02 PM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM

The final installment of EAMCET counseling  23 onwords

ఏపీ ఎంసెట్-2016 ఇంజనీరింగ్ విభాగం తుది విడత కౌన్సెలింగ్ ఈనెల 23, 24 తేదీల్లో జరగనుంది. ఈమేరకు అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతలో మిగిలిపోయిన సీట్లు, కేన్సిల్ అయిన సీట్లు, కాలేజీల్లో చేరకుండా అభ్యర్ధులు డ్రాప్ అయిన ఖాళీలను ఈ తుదివిడతలో భర్తీచేయనున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల కోసం ఎంసెట్‌లో అర్హులైన అభ్యర్ధులు ఈ తుదివిడత కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు.

 

ఫార్మా-డి కోర్సులు కూడా తుదివిడత కౌన్సెలింగ్‌కు జతచేస్తున్నట్లు కన్వీనర్ వివరించారు. మొదటి విడతలో సీట్లు పొంది వెబ్‌ద్వారా సెల్ఫ్ రిపోర్టు, కాలేజీల్లో రిపోర్టు చేయని అభ్యర్ధుల ఈనెల 20వ తేదీ లోపల ఆయా కాలేజీలకు వెళ్లి చేరవచ్చని వివరించారు. ఆతేదీ లోగా చేరకపోతే ఆ సీట్లను ఖాళీలుగా పరిగణించి తుది విడత కౌన్సెలింగ్‌కు జతచేయనున్నట్లు స్పష్టంచేశారు. అలాగే ఏపీ ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది తరువాత జాతీయ విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు పొందిన వారు తమ సీట్లను రద్దు చేసుకోవాలని భావిస్తే సంబంధిత కాలేజీలను ఈనెల 20లోగా సంప్రదించి తమ ప్రొవిజనల్ అలాట్‌మెంటును రద్దు చేసుకోవాలని సూచించారు.

 

అన్ని ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు, యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ సంస్థల్లో కేన్సిల్ అయిన, రిపోర్టు చేయక ఖాళీగా ఉన్న సీట్లను ఈనెల 21వ తేదీ నాటికి అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ఏపీఎంసెట్‌లో మెరిట్ సాధించిన వారిలో తదుపరి స్థానాల్లో ఉన్న వారికి ఈ సీట్లు తుదివిడత కౌన్సెలింగ్‌లో కేటాయింపు కానున్నాయన్నారు.


18 నుంచి బీఫార్మసీ కౌన్సెలింగ్
ఇలా ఉండగా ఏపీఎంసెట్ రాసి అర్హులైన బైపీసీ విభాగం అభ్యర్ధులు బీఫార్మసీ, ఫార్మాడీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ తెలిపారు. ఈనెల 11వ తేదీన ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీకానుంది. ఇతర వివరాలకు అభ్యర్ధులు ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీడీ.ఎన్‌ఐసీ.ఐఎన్’ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని వివరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement